Airport Metro: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టు మెట్రో మార్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ మార్గంలో ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఎయిర్ పోర్టు మెట్రో మార్గంలో చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఐటీ కారిడార్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు మధ్య ఉన్న ఈ ప్రాంతంలో అభివృద్ధి ఊహించని స్థాయిలో శరవేగంగా జరుగుతోంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మెట్రో మార్గంలోనూ పలు మార్పులు చేయాల్సి ఉందని ఇటీవలె మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. రాయదుర్గం- శంషాబాద్ మెట్రో మార్గాన్ని.. కేవలం ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తే కుదరదని.. ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ మార్గంలో అభివృద్ధి ఊహించని స్థాయిలో ఉండగా.. అందుకు తగ్గట్లుగా ఇప్పుడే మెట్రో మార్గంలో మార్పులు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
మరో 5 స్టేషన్లు నిర్మించాలని యోచన
గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగు రోడ్డు, శంషాబాద్ వద్ద ఉన్న బెగళూరు నేషనల్ హైవే వరకు ఉన్న 24 కిలోమీటర్ల మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. మెట్రో మార్గం పడితే ఈ అభివృద్ధి మరింతగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజల అవసరాలు తీర్చేలా మెట్రో ఉండాలని భావిస్తున్నారు. ట్రాఫిక్ గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో.. మెట్రో స్టేషన్లను ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నిర్మిస్తే భవిష్యత్ అవసరాలను తీర్చవచ్చని ట్రాఫిక్ నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఈ మార్గంలో 9-10 మెట్రో స్టేషన్లు నిర్మించాలని ప్రాథమింకగా నిర్ణయించగా.. ఇప్పుడు 2-3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున స్టేషన్ నిర్మించేందుకు అనుకూల ప్రాంతాలను గుర్తించే పని కూడా చేపడుతున్నారు. కొత్తగా మరో 5 మెట్రో స్టేషన్లు నిర్మించేందుకు కొన్ని ప్రాంతాలను గుర్తించే పనిలో మెట్రో అధికారులు ఉన్నారు.
భారీగా పెరగనున్న ట్రాఫిక్
ఐటీ కారిడార్ విస్తరణ మాదాపూర్ నుంచి మొదలై సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న కోకాపేట, నార్సింగి వరకు విస్తరించింది. భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డు వెంట విస్తరించే అనుకూలంగా ఉంది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలోని కిస్మత్ పూర్ లో సుమారు 37 అంతస్తులతో ఒక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మరో 10 భారీ ప్రాజెక్టులు కూడా నిర్మాణంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు తెలంగాణ పోలీస్ అకాడమీ, శంషాబాద్, రాజేంద్రనగర్, గగన్ పహాడ్ ప్రాంతాల్లో రానున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. శంషాబాద్ ఓఆర్ఆర్ ఇంటర్ ఛేంజ్ నుంచి ఆరాంఘర్ వెళ్లే మార్గంలోనూ భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోనున్నాయి.
ఐటీ పార్కులు, ఎకో పార్కులు..
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్ ఛేంజ్ సమీపంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 180 ఎకరాల్లో ఐటీ పార్కును ప్రతిపాదించింది. భవిష్యత్తులో మరో 100 ఎకరాల్లో బుద్వేల్, కిస్మత్ పూర్ ప్రాంతాల్లో ఐటీ పార్కులు రానున్నాయి. అలాగే కొత్వాల్ గూడలో రూ.300 కోట్లతో హెచ్ఎండీఏ ఎకో పార్కు నిర్మిస్తోంది. ఇది పూర్తయితే.. రోజూ వేలాది మంది ఈ ఎకో పార్కును సందర్శించడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాయదుర్గం-శంషాబాద్ మార్గం మెట్రోలో రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.