Hyderabad Rains: హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. అత్యవసర సేవలకు GHMC కంట్రోల్ రూమ్ 21111111, 23225397 నంబర్లను సంప్రదించాలన్నారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, EVDM డైరెక్టర్, కలెక్టర్‌తో మంత్రి తలసాని మాట్లాడారు. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెట్లు, కొమ్మలు కూలిన చోట నుంచి వెంటనే తొలగించాలన్నారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలన్నారు.
చిగురుటాకులా వణికిపోతున్న హైదరాబాద్
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్‌రింగ్‌రోడ్, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్, సికింద్రాబాద్, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైస్, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్ ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది.
బొల్లారం, చిలకలగూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెబీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మియాపూర్, కుత్భుల్లాపూర్, బీహెచ్‌ఈఎల్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నంలో వాన దంచికొడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నీరు నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. నగరవాసుల జీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరింది.
‘హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దయచేసి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లండి. 3,000 కంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన మా బృందాలు, నగరం అంతటా నీటి నిలిచిన ప్రాంతాలను క్లియర్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. GHMC-DRF సహాయం కోసం 040-21111111, 90001 13667కు కాల్ చేయవచ్చు” అని GHMC కమిషనర్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు, పడిపోయిన చెట్లను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఆరామ్‌ఘర్ వద్ద నీటిలో చిక్కుకుపోయిన TSRTC బస్సును ట్రాఫిక్ పోలీసులు, GHMC DRF బృందాలు విజయవంతంగా రక్షించాయి. అలాగే శ్రీనగర్‌లో వర్షపు నీటిలో చిక్కుకున్న మరో బస్సును జీహెచ్‌ఎంసీ ఎంఈటీ, డీఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తీశారు.