హైద‌రాబాద్‌లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది.  ఉదయం పూట ఎండాకాలం తరహాలో ఎండ కాస్తోంది. కానీ మధ్యాహ్నం అయ్యే సరికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఇదే పరిస్థితి. బుధవారం రెండో సారి కురిసిన భారీ వర్షానికి మూసీ న‌దికి వ‌ర‌ద పోటెత్తింది.  మూసారాంబాగ్ బ్రిడ్జి వ‌ద్ద మూసీ ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. వ‌ర‌ద నీటితో మూసారాంబాగ్ బ్రిడ్జి మునిగిపోయింది. బ్రిడ్జి పై నుంచి వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తుండ‌టంతో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను వేరే మార్గాల్లో మ‌ళ్లించారు. కముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేయ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు  పడ్డారు.  చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి న‌ల్ల‌గొండ ఎక్స్ రోడ్డు వ‌ర‌కు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దులుతున్నాయి. 


హైదరాబాద్‌ నలువైపులా భారీ వర్షం - ఆరెంజ్ అలర్ట్ జారీ 
 
శివరాం పల్లిలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా..రాజేంద్రనగర్ లో 3.3 సెంటీమీటర్ల వర్షం పడింది. జూపార్క్, మలక్ పేట్, చార్మినార్, శాస్త్రిపురంలో 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎల్బీనగర్ ,కిషన్ బాగ్ లో 2.5 సెంటీమీటర్లు, మొండా మార్కెట్, రామంతాపూర్ బాలానగర్ లో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ, రేపు రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అటు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.  ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీచేసింది.    


అవసరమైతేనే బయటకు రావాలని గ్రేటర్ వాసులకు అధికారుల సలహా


వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో  హైదరాబాద్ వాసులకు పోలీసులు, గ్రేటర్ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్నారు. అవ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని సూచిస్తున్నారు. మూసారాంభాగ్ బ్రిడ్జి మూసివేయడంతో పురానాపూల్ బ్రిడ్జి, మొజంజహీ బ్రిడ్జి, నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, చాదర్‌ఘాట్ కాజ్వే, మూసారాంబాగ్ బ్రిడ్జి వైపు నుంచి ఓల్డ్ సిటీ, మలక్‌పేట్, ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనదారులు అవసరాన్నిబట్టి 100 ఫీట్ రోడ్, జియా గూడ, రామ్ సింగ్ పుర, అత్తాపూర్, ఆరాంఘర్, మైలార్ దేవ్ పల్లి చాంద్రాయణగుట్ట మీదుగా ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. 


వినాయక నిమజ్జనాలతో ట్రాఫిక్‌కు మరింత చిక్కులు


వినాయక నిమజ్జన సందడి కూడా ఉండటంతో వినాయక విగ్రహాలతో  వెళ్లే వాహనదారులు 100 ఫీట్ రోడ్, జియా గూడ, రామ్‌సింగ్‌పుర, అత్తాపూర్, ఆరాంఘర్, మైలార్‌దేవ్ పల్లి, చాంద్రాయణగుట్ట మార్గాలు ఎంచుకోవాల్సి ఉంటుంది.  ఉప్పల్, దిల్‌షుక్‌నగర్, ఎల్బీ నగర్ వెళ్లే వాహనదారులు అఫ్జల్‌గంజ్, సిటీ బస్ స్టేషన్ (సీబీఎస్), రంగమహల్, చాదర్‌ఘాట్, నింబోలిఅడ్డ, బర్కత్‌పుర, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక, హబ్సీగూడ, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  మూసారాంబాగ్ వంతెన పై నుంచి వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయం చూసుకుంటే మంచిదని చెబుతున్నారు . 


మనందరం భారత్‌ను ఏకం చేద్దాం - పాదయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ పిలుపు