Hyderabad Nimajjan News: హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలు చేసే అంశంలో ఉత్కంఠకు తెర పడింది. వినాయక నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. మట్టి విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందు కోసం ఎన్టీఆర్ మార్గ్‌లో 8, నెక్లెస్ రోడ్డులో 4 క్రేన్లను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఇప్పటికే ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా ట్యాంక్ బండ్‌పై నుంచి కూడా నిమజ్జనాలు చేయడానికి జీహెచ్‌ఎంసీ భారీ క్రేన్లను ఏర్పాట్లు చేస్తోంది.
ట్యాంక్ బండ్ పై కొత్తగా 10 క్రేన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ట్యాంక్ బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న (సెప్టెంబరు 6) వారు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు పూనుకోగా, పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వారిని స్టేషన్ కు తరలించారు.
కోర్టు ఆదేశాలు పాటిస్తాం - సీపీ
ఈ విషయంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నిన్న (సెప్టెంబరు 6) విలేకరులతో మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైకోర్టు గత నెలలో ఇచ్చిన ఆదేశాలనే పాటిస్తామని అన్నారు. తాజా హైకోర్టు ఆదేశాలను అనుసరించి.. వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేయడానికి వీల్లేదన్నారు. కేవలం మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ట్యాంక్ బండ్ కు అవతలి వైపు నిమజ్జనం చేయొచ్చని తెలిపారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ వైపు కూడా నిమజ్జనం చేయొచ్చని వివరించారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను తప్పనిసరిగా బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలని చెప్పారు. ‘‘ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం సమయంలో మార్గదర్శకాలను కోర్టు జారీ చేయాల్సి వస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోగా నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్దేశిత ప్రణాళికను రూపొందించాలి’’ అని ఇటీవల హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సి ఉంది.
వ్యర్థాలు ఉన్న చోట నిమజ్జనం పాపం - ఉత్సవ సమితి
వ్యర్ధాలు అధికంగా ఉన్న చెరువులో నిమజ్జనం చేయడం మహా పాపం అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు. హుస్సేన్ సాగర్ లో వినాయకుడి నిమజ్జనానికి ప్రభుత్వం వెంటనే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. మహంజాహీ మార్కెట్ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.