బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం సభ బయట ఈటల రాజేందర్, స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అందులో పేర్కొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈటల మర మనిషి అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అయితే, ఆ వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 


బీజేపీని బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశానికి పిలవకపోవడంపై స్పందిస్తూ ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. గత 20 ఏళ్లుగా తాను అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. పార్టీ తరపున ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీని పిలిచే సంప్రదాయం ఉందని అన్నారు. అలాంటిది, 4 పార్లమెంట్, 3 శాసన సభ్యులు ఉన్న పార్టీ అలాంటి పార్టీ సభ్యులను బిజినెస్ అడ్వైసరీ కమిటీ మీటింగ్ కి పిలవకపోడం ద్వేష పూరిత రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.


స్పీకర్ పై వ్యాఖ్యలు
‘‘మీకు ఇదే గతి పడుతుందని మర్చిపోకండి. పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు. సభ ఎప్పటికీ ఉంటుంది. స్పీకర్.. మరమినిషి లెక్క కాకుండా సభ్యుల హక్కులు కాపాడాలి’’ అని ఈటల రాజేందర్ విమర్శించారు. 


Also Read: Janagama: ప్రేమ పెళ్లికి కండీషన్ పెట్టిన వధువు ఫ్యామిలీ - విషం తాగిన వరుడు, అతని తల్లి


మంత్రి వేముల మండిపాటు
ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పుబట్టారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈటల రాజేందర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, 20 ఏళ్లు అనుభవం ఉందని చెబుతూ సభాపతి స్థానాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. స్పీకర్ నిబంధనల మేరకు తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారని అన్నారు. 


ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా బీజేపీకి బీఏసీలో అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశమంతటా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీలో ఉన్న ఈటలతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ నిబంధనలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మార్చుకున్న సంగతి ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. బీజేపీకి భయపడి నిబంధనలు మార్చుతామా అని ప్రశ్నించారు. 


అసెంబ్లీ స్పీకర్ సీఎం కనుసన్నల్లో ప్రవర్తిస్తే లోక్‌సభ స్పీకర్ ప్రధాని మోదీ కనుసన్నల్లో ఉంటున్నారా? అని ప్రశాంత్ రెడ్డి కౌంటర్ వేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలను ఈటల రాజేందర్ వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ ను అవమానిస్తే మొత్తం అసెంబ్లీని అవమానపరిచినట్లేనని అన్నారు.స్పీకర్ విషయంలో మాట్లాడేముందు సభ్యులు ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని ఉండాల్సిందని అన్నారు.


Also Read: Jagga Reddy: జగ్గారెడ్డిలో లవ్ యాంగిల్ కూడా! టెన్త్ క్లాస్‌లోనే మొదలు - ఆమె ఎవరో చెప్పేసిన ఎమ్మెల్యే