Bharat jodo Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సీఎంలు  పాల్గొన్నారు.  మధ్యాహ్నం 3.05 గంటలకు తీరువల్లూర్ మెమోరియల్ ను, 3.25గంటలకు కామరాజ్ మెమోరియల్‌ను రాహుల్ సందర్శించారు. సాయంత్రం 4.10గంటలకు మహాత్మాగాంధీ మండపం వద్ద ప్రార్థనలో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు మహాత్మాగాంధీ మండపంలో  రాహుల్ గాంధీకి తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ జాతీయ జెండాను అందించారు. దాంతో  రాహుల్ పాదయాత్ర అధికారికంగా ప్రారంభమయింది.



యాత్ర ప్రారంభించిన తర్వాత  మహాత్మా గాంధీ మండపం నుంచి బీచ్ రోడ్ వరకు జరిగే మార్చ్ లో రాహుల్ పాల్గొన్నారు. తర్వాత ప్రసంగించారు. ‘మనమందరం భారత్ ను ఏకం చేద్దాం’ అనే నినాదంతో భారత్ జోడో యాత్ర ముందుకు సాగుతుందని రాహుల్ తెలిపారు.   ఈ యాత్రలో భాగంగా  ప్రతీ రోజూ ఉదయం 7 గంటల నుంచి రాహుల్ గాంధీ నడకను మొదలుపెట్టనున్నారు. రోజుకు సగటున 25 కిలోమీటర్లు రాహుల్ నడవనున్నారు. ప్రతిరోజూ రెండు విడతల్లో యాత్ర జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలో 4 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 117 మంది నేతలు రాహుల్ గాంధీ వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. 





 
కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను కదలించేలా ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 150 రోజుల (5 నెలలు)  పాటు 3,570 కిలోమీటర్ల మేర.. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొనే వారిలో రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ కురవృద్ధుడు విజేంద్ర సింగ్ మహల్వాట్ కీలక పాత్ర పోషించ నున్నారు. వీరిలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అజమ్ జోంబ్లా, బెమ్ బాయ్ లాంటి యంగెస్ట్‌ లీడర్స్ కూడా ఉన్నారు. కన్హయ్యా కుమార్, పవన్ ఖేరా కూడా యాత్రలో పాల్గొననున్నారు.  


భారత్ జోడో యాత్ర రూట్‌ మ్యాప్ ఆధారంగా చూస్తే..మొత్తం 20 కీలక ప్రాంతాల మీదుగా సాగనుంది. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయ్‌చూర్, వికారాబాద్, నాందేడ్, జలగావ్, ఇండోర్, కోటా, దౌసా, అల్వార్, బులంద్‌షర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్ము, శ్రీనగర్ వరకూ సాగుతుంది. ఏపీ, తెలంగాణలోనూ రాహుల్ పాదయాత్ర సాగుతుంది.