ప్రధానమైన టోర్నీల్లో కీలకమైన మ్యాచులు ఓడిపోవడం ఇటీవల టీమిండియాకు అలవాటుగా మారింది. ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొట్టే భారత్.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం తడబడుతోంది. ముఖ్యమైన మ్యాచులను కోల్పోయి కప్ సాధించే అవకాశాలను పొగొట్టుకుంటోంది. ఇదే ఆటతీరుతో అంతకుముందు 2021 టీ20 ప్రపంచకప్, ఇప్పుడు ఆసియా కప్‌లను దూరం చేసుకుంది. దీనిపై భారత జట్టు సీనియర్ ఆటగాడు వసీం జాఫర్ తన ఆలోచనలను పంచుకున్నారు. 


ప్రధాన టోర్నమెంట్లలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని.. దాన్ని తట్టుకుని రాణించడంలో టీమిండియా విఫలమవుతోందని జాఫర్ అన్నాడు. కెప్టెన్ రోహిత్ కూడా లంకతో మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని చెప్పాడని అన్నారు. వేర్వేరు సిరీస్ లకు వేర్వేరు జట్లతో ఆడడం కూడా దీనికి ఒక కారణం కావొచ్చని అభిప్రాయపడ్డాడు. 


పాకిస్థాన్, శ్రీలంకలపై ఓటమికి గల కారణాలను జాఫర్ విశ్లేషించాడు. భారత్ ముందు బ్యాటింగ్ చేసినప్పుడు కనీసం 15-20 పరుగులు తక్కువ చేస్తోందని అన్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడం సమస్యగా మారిందన్నాడు. ఏడో నెంబర్ వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లున్నా.. దానిని టీమిండియా సద్వినియోగం చేసుకోవట్లేదని అభిప్రాయపడ్డాడు. మేజర్ టోర్నీల్లో ఒత్తిడిని ఆటగాళ్లు అధిగమించలేకపోతున్నారని అన్నాడు. 


బౌలర్లు కొత్త బంతితో వికెట్లు తీయకపోవడం మైనస్ గా మారిందని తెలిపాడు. మొదటి 6 ఓవర్లలో వికెట్లు రాకపోవటంతో బౌలర్లు ఒత్తిడికి గురవుతున్నారని.. ఇది ప్రత్యర్థి బ్యాటర్లకు లాభిస్తుందని అన్నాడు. మంచి స్కోరు సాధించినా బౌలర్లు వికెట్లు తీయకపోతే విజయం దక్కదని అన్నాడు. గత 2 మ్యాచుల్లో మంచి పరుగులే చేశారని.. అయినప్పటికీ వికెట్లు తీయకపోవడం వల్ల గెలవలేదని అన్నాడు.