HCA Election Notification:
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికల నగారా మోగింది. హెచ్‌సీఏ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం వెలువడింది. 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను హెచ్‌సీఏ విడుదల చేసింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, ఈసీ పోస్టులకు అక్టోబర్ 11వ తేదీ నుంచి 13 వరకు నామినేషన్లను ఎన్నికల అధికారి వి.సంపత్ కుమార్ స్వీకరిస్తారు. అక్టోబర్ 14న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 16లోపు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అక్టోబర్ 20న హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నట్లు హెచ్‌సీఎ ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
అసోసియేషన్ లో సమస్యల పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు జస్టిస్ కక్రూ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయినా కమిటీ సభ్యుల మధ్య విభేదాలు రావడంతో సుప్రీంకోర్టు ఆ కమిటీని రద్దు చేసింది. హెచ్‌సీఏ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు అప్పగించడం తెలిసిందే.
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజహరుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య విభేదాల తలెత్తడంతో వ్యవహారం కోర్టులకు వెళ్లింది. చివరికి సుప్రీంకోర్టుకు కేసు వెళ్లగా.. విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో గందరగోళాన్ని తొలగించేందుకు ఎన్నికలు నిర్వహించడమే మార్గమని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో హెచ్‌సీఏ కు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది.