MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ లోకి చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మంత్రి హరీశ్ రావుతో ఆయన సమావేశం అయిన అనంతరం ఈ ప్రచారం మొదలైంది. బీజేపీ రాజా సింగ్ ను పార్టీ నుంచి గతంలో సస్పెండ్ చేశారు. తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తాజాగా రాజాసింగ్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారన్న ప్రచారం పూర్తిగా అబ్ధమని, తాను బీజేపీని వదిలి ఏ పార్టీలోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.
బీజేపీ తనపై విధించిన సస్పెన్షన్ ను ఒకవేళ ఎత్తివేయకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా కానీ.. ఇతర పార్టీల్లోకి చేరే ప్రసక్తే లేదన్నారు. దూల్‌పేటలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి గురించి మాత్రమే మంత్రి హరీశ్ రావు వద్దకు వెళ్లినట్లు తెలిపారు. దూల్‌పేట పై దృష్టి పెట్టి ప్రస్తుతం ఉన్న ఆస్పత్రిని 30 లేదా 50 పడకల ఆస్పత్రిగా అభిృద్ధి చేయాలని కోరడానికి మంత్రి వద్దకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన ఇద్దరు మంత్రులను కోరానని, ప్రస్తుతం మూడో హెల్త్ మినిస్టర్ గా ఉన్న హరీశ్ రావును కూడా కలిసి ఇదే విషయాన్ని మాట్లాడినట్లు తెలిపారు.
దూల్‌పేట ఆస్పత్రి విషయంపైనే కలవాలని అపాయింట్‌మెంట్ అడిగితే ఇచ్చారని, ఆస్పత్రి విషయం గురించి అడగడానికి మాత్రమే మంత్రి ఇంటికి వెళ్లినట్లు వెల్లడించారు. దూల్‌పేటలోని చిన్న ఆస్పత్రిని మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశానన్నారు. దానిపై స్పందించిన హరీశ్ రావు.. అధికారుల బృందాన్ని పంపించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రాజా సింగ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. అలాగే కాషాయం, బీజేపీ నా నరనరాల్లోనూ ఉందని పేర్కొంటూ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్టు చేశారు.
గతేడాది ఆగస్టులో రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ
అత్యంత వివాదాస్పదమైన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు రాజాసింగ్. దానిపై రాత్రికి రాత్రే తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు వెంటనే స్పందించి... యూట్యూబ్ నుంచి ఆ వీడియోను తొలగింప చేశారు. వెంటనే రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ వీడియో తీవ్ర వివాదం కావడంతో బీజేపీ పార్టీ వెంటనే స్పందించి పార్టీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది. హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ఆయన గతంలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ స్టాండప్ కామెడీ చేశారని.. అందుకే ప్రదర్శనకు అంగీకరించబోమన్నారు. అయితే కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం మీద మునావర్ షో ఇవ్వడానికి వచ్చినందున పోలీసులు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని షోను సక్సెస్ చేశారు. రెండు రోజుల పాటు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. అయితే తమ కార్యకర్తలు టిక్కెట్లు కొన్నారని.. మునావర్‌ను కొడతామని.. వేదికను తగులబెడతామని హెచ్చరించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. మునావర్ షోకు అనుమతి తాను చేయాల్సింది చేస్తానని ఆయన హెచ్చరించారు. ఆ ప్రకారం.. వీడియోను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఓ వర్గం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉండంతో పోలీసులు వేగంగా స్పందించారు. వీడియోను తీసేయించినా ఆ విషయం మాత్రం వైరల్ అయింది. వెంటనే స్పందించిన బీజేపీ.. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.