Revanth Reddy Ganesh Idol Row : హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఎంతో ప్రత్యేకమైనవి. తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేనట్లుగా భాగ్యనగరంలో వైభవంగా నవరాత్రి పూజలు, అత్యంత వైభవంగా నిమర్జనం జరుగుతాయి. ఇంతలా ప్రత్యేకత కలిగిన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినట్లు వినూత్న విగ్రహాలు, భారీ సంఖ్యలో ఎత్తైన విగ్రహాలు మరెక్కాడా ఉండవు. గణేష్ పండుగ అంటే హైదరాబాద్‌లో అతి పెద్ద వేడుక. ఇప్పుడు ఇదే ఉత్సాహం విమర్శలకు కారణమవుతోంది. తాజాగా హబీబ్ నగరంలో గణేష్ విగ్రహం ఏర్పాటు వివాదంగా మారింది. 

Continues below advertisement


హబీబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ నేత, తెలంగాణ మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నగరంలో పెను దుమారం రేపుతోంది. షర్ట్ ,ఫ్యాంట్ ,షూ ధరించిన రేవంత్ రెడ్డి విగ్రహానికి తల భాగంలో వినాయకుడి శిరస్సును ఏర్పాటు చేసి, రేవంత్ రెడ్డి వినాయకుడి రూపంలో ధర్మనమిస్తున్నట్లుగా ఇక్కడ మండపంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. వినాయక మండపాన్ని సైతం తెలంగాణ రైజింగ్ అనే హోర్టింగ్ లతో ఏర్పాటు చేశారు. ఇలా ఏకంగా సిఎం రేవంత్ రెడ్డిని వినాయకుడి రూపంలో మార్చి , నవరాత్రి పూజలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాాలు దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకోవాలంటున్న రాజాసింగ్, ఫిర్యాదులు పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నేను హబీబ్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని చూశాను. మెట్టు సాయికుమార్ ఏర్పాటు చేసిన విగ్రహం హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. రేవంత్ రెడ్డిపై అభిమానం ఉంటే ఉండొచ్చు., కానీ రేవంత్ రెడ్డి మాకు దేవుడు కాదు. ఇలా దేవుడిని అవమానించేలా రేవంత్ రెడ్డి రూపంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం సరైనది కాదు. హైదారాబాద్ పోలీసుశాఖ వెంటనే ఈ విగ్రహాన్ని తొలిగించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుడికి పూజలు చేయడం ఆపేలా చర్యలు తీసుకోవాలి. మత సామరస్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవడంతోపాటు, సాధ్యమైనంత త్వరగా విగ్రహాన్ని తొలిగించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.




విగ్రహాన్ని ఏర్పాటు చేసి మెట్టు సాయికుమార్ ఏమంటున్నారంటే..?


తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపాలని రేవంత్ రెడ్డి పడుతున్న తపనకు ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ వినాయకుడి రూపంలో సిఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశాము. ప్రతీ ఏటా ట్రెండింగ్ లో ఉన్న సినిమా హీరోల రూపంలో ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసేవారు. ఈసారి సీఎం రూపంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. రేవంత్ రెడ్డికి బీఆర్ ఎస్,  బీజేపి నుంచి అనేక విఘ్నాలు  అడ్డుపడుతున్నాయి. ఆ విఘ్నాలు తొలిగిపోవాలనే ఉద్దేశ్యంతోనే ఇలా వినూత్నంగా విగ్రహం ఏర్పాటు చేశాము. ఈ నవరాత్రులు విగ్రహానికి ప్రత్యేక పూజులు నిర్వహిస్తాము. కొందరికి నచ్చకపోవచ్చు కానీ చాాలా మంది రేవంత్ విగ్రహాన్ని వినాయకుడి రూపంలో ఏర్పాటు చేయడంపై హర్షం వక్తం చేస్తున్నారు.