Gaddar Last Rites:  ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు హైదరాబాద్ లో సోమవారం జరగనున్నాయి.  సోమవారం (ఆగస్టు 7న) మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతియయాత్ర ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం వరకు ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహం ఉంచారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆల్వాల్ కు గద్దర్ భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆల్వాల్ లో గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ప్రజా గాయకుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గద్దర్ భార్య విమల తన నిర్ణయాన్ని తెలిపారు. అయితే అంతిమయాత్రలో భాగంగా గద్దర్ భౌతికకాయాన్ని కొంతసేపు భూదేవి నగర్ లోని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. అయితే గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఉద్యమ నేతలు, పలు పార్టీల నాయకులు, ప్రజా హక్కుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.


Activist and Singer Gaddar Passes Away: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఇటీవల ఆయనకు గుండె ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ కావడంతో, అంతా బాగానే ఉందని డాక్టర్లు, కుటుంబ సభ్యులు సైతం ప్రకటించారు. త్వరలోనే తాను గళం విప్పుతానని ప్రజా గాయకుడు సైతం ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ ఉపిరితిత్తుల ఇన్ ఫెక్షన్, యూరినరీ సమస్యలు తీవ్రతరం కావడంతో ఆరోగ్యం విషమించింది. నేటి ఉదయం ఒక్కసారిగా పెరిగిన బీపీని కంట్రోల్ చేసే సమయంలోనే గద్దర్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోయాయి. శరీరంలోని అవయవాలు చికిత్సకు స్పందించకపోవడం, కిడ్నీ, లివర్ పని మందగించడంతో ప్రజా యుద్ధనౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు.


1949లో లచ్చమ్మ, శేషయ్య దంపతులకు తూప్రాన్ లో గద్దర్ జన్మించారు.  తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యం కల్పించడంలో గద్దర్ ఎంతో కీలకపాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చిన ఘనత గద్దర్ దే. దశాబ్దాలపాటు పీడిత వర్గాల పక్షాన గళం విప్పి పోరాటం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి బుర్రకథతో ప్రచారం చేశారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట "ఆపర రిక్షా" రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్ కాగా, తరువాత ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. 1975లో బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్ష రాసిన గద్దర్ జాబ్ రావడంతో కెనరా బ్యాంకులో క్లార్క్ గా చేరారు. అనంతరం విమలను వివాహం చేసుకోగా, వారికి సంతానం ముగ్గురు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల ఉన్నారు. చిన్న కుమారుడు చంద్రుడు 2003 లో అనారోగ్యంతో మరణించారు. 
 Also Read: Gaddar Passes Away: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత, ధ్రువీకరించిన కుమారుడు సూర్యం


మాభూమి సినిమాలో నటించిన గద్దర్.. గతంలో బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి అనే పాటను పాడారు. గోచి ధోతి, పైన గొంగళి ధరించి సామాన్యుడిలా కనిపించే ఆయన ఉద్యమ శిఖరంలా మారారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన తన పాటలతో ఊపిరి పోశారు. "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు ప్రకటించగా.. ఆ అవార్డును తిరస్కరించారు. జై బోలో తెలంగాణా సినిమాలో 'పొడుస్తున్న పొద్దూ' మీద పాటను ఆయనే రాసి పాడారు. ఉద్యమానికి ఈ పాట సైతం ఎంతో ప్లస్ పాయింట్ అయింది. 
Also Read: Gaddar Passes Away: తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన గొప్ప ఉద్యమ శక్తి గద్దర్