Telangana Power Scam : విద్యుత్ కొనుగోలు విషయంలో వస్తున్న ఆరోపణలు,జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ ఇచ్చిన నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు. అందులో ఈ అంశాలు ఉన్నాయి. ఆ లెటర్‌ పూర్తి సారాంశం ఇదే 


"రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణలో విద్యుత్తు రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేది. ఏ ఒక్క సెక్టారు కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయేది. పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్తు అవసరాల దృష్ట్యా విభజన చట్ట ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఎంతమాత్రం సరిపోదు. 2014 నాటి వినియోగాన్ని బట్టి దాదాపు 2,700 మెగావాట్ల కొరత ఉంది. ఆంధ్రప్రదేశ్ కరెంట్ సరఫరాను ఎగవేయడం వల్ల 1,500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2,400 మెగావాట్ల లోటు ఏర్పడింది. మొత్తమ్మీద సుమారు 5,000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్తు రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి శాశ్వత ప్రయోజనాలు కోసం విద్యుత్తు పంపిణీ వ్యవస్థను పటిష్ఠపరచాం. ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7,778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్తు, తర్వాత సుమారు 20,000 మెగావాట్లపైచిలుకుకు చేరింది. దేశంలోనే నాణ్యమైన నిరంతరాయ కరెంటు అన్ని రంగాలకూ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రంగా మారింది. 


2014లో సంక్షోభంలో ఉన్నాం


2014 నాటికి తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 1,196 యూనిట్లు ఉండగా, పదళ్లలో అది 2,349 యూనిట్లకు పెరిగింది. ఈ విజయాలు ఆషామాషీగా సాధించలేదు. విద్యుత్తు కొనుగోళ్ల విధానంలో, నూతన విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటులో చట్టాలను, నిబంధనలను పాటించాం. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ అవసరమైన అన్ని రకాల అనుమతులను పొంది ఎస్.ఇ.ఆర్.సి తీర్పులకు లోబడే చర్యలూ తీసుకున్నాం. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఇ.ఆర్.సిలో ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై తీర్పు నచ్చకుంటే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చు


అప్పుడు ఎందుకు అప్పీల్ చేయలేదు


ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్తు సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి తెలంగాణ ఇ.ఆర్.సికి అభ్యంతరాలు చెప్పారు. వాటిని పరిశీలించిన తర్వాతే తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఇ.ఆర్.సి. ఆమోదముద్ర వేసింది. అప్పుడు అభ్యంతరం ఉండి ఉంటే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ కు లేదా ఇతర కోర్టులకు వెళ్లే స్వేచ్ఛ ఉంది. కానీ ఆయన ఆనాడు ఎలాంటి అప్పీలుకూ వెళ్లిన దాఖలాలు చేయలేదు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్తు విజయాలను సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేశారు. వాటిపై చర్చలు జరిగాయి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థల తీర్పులపై విచారణ చేయొద్దన్న ఇంగితం లేకండా కమిషన్‌ ఏర్పాటు చేశారు. 


మీకు తెలియదా ?


హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వ్యక్తి కూడా న్యాయ ప్రాధికార సంస్థల తీర్పులపై ఎంక్వైరీ చేయొద్దని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి, అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణనలోకి తీసుకోకుండానే 11.08.2024 నాడు పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. వాటిపై నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నాను.


అన్నిఅనుమతులతోనే భద్రాద్రి థర్మల్ స్టేషన్ 


ప్రభుత్వంలో ఉన్న వాళ్లు... కొన్నిసార్లు అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కరెంటు విషయంలో ఆనాడు మేం అసాధారణ నిర్ణయం తీసుకున్నం. 2014 నాటికి సబ్ క్రిటికల్‌పై ఎలాంటి నిషేధం లేదు. 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళిక కూడా సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు నిర్మించుకోవచ్చని పేర్కొంది. 11-6-24 రోజున మీడియాతో మాట్లాడుతూ...  ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్‌పై ఆరోపణలు చేశారు. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన నాటికి యావత్తు దేశవిద్యుత్తు రంగమే 90 శాతం సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ల విద్యుత్తు ఉత్పత్తిపైనే ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సబ్ క్రిటకల్ ప్లాంట్ పెట్టినట్టు చేయరాని తప్పు ఏదో చేసినట్టు మాట్లాడారు. 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవన్న వాస్తవాన్ని విస్మరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల అనుమతులు పొందిన తర్వాతే భద్రాద్రి థర్మల్ స్టేషన్ ప్రారంభమైంది. అందుకే ఈ అంశాన్ని విచారించే విచారణార్హతను కోల్పోయారు. కాబట్టి మీరు మీ బాధ్యతలనుంచి విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను


భద్రాద్రి అదనపు బొగ్గు భారాన్ని తెలంగాణ జన్కోలోని నెగోషియేషన్స్ కమిటీ, వాళ్లు అవలంబించే ఫార్ములా ద్వారా అంచనా వేసి, బి. హెచ్. ఈ ఎల్‌తో మాట్లాడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.400 కోట్లు తగ్గించారు. దీనికి బి.హెచ్.ఈ.ఎల్. అంగీకరించిన తర్వాతే భద్రాద్రి ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ వాస్తవాన్ని విస్మరించిన మీరు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందనన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. అందుకే విచారణార్హత మీరు కోల్పోయారు. 


కరోనా, కోర్టు కేసులు మరిచారా


భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే దశలో తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్తు లోటుతో ఉంది. ప్రజల అవసరాలు తీర్చడానికి, గత్యంతరంలేక అధిక ధరలకు పవర్ ఎక్స్చేంజిల ద్వారా కరెంటు కొనుగోలు చేశారు. అప్పుడే బి.హెచ్.ఈ.ఎల్. ముందుకొచ్చి కేవలం రెండేళ్లలోనే ప్లాంట్ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చింది. అందుకే నామినేషన్ పద్ధతిలో భద్రాద్రి పనులను అప్పగించాం. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం మా పార్టీ పాలసీ కాబట్టి ఆ సంస్థకు పనులు ఇచ్చాం. అయితే అనుకున్నంత వేగంగా పనులు పూర్తి కాలేదన్నట్టు, దానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు మీరు మాట్లాడారు. ఇలా మాట్లాడేటప్పుడు భద్రాద్రి మీద ఎన్.జి.టి. విధించిన స్టే ఆర్డర్ను, కరోనా వల్ల కలిగిన  అంతరాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం.


2014 నాటికి తెలంగాణ నేషనల్ గ్రిడ్ కనెక్ట్ కాకుండా కేవలం దక్షిణ గ్రిడ్‌లోనే ఉంది. దీంతో ఈ కరెంటు లోటు పూడ్చేందుకు దక్షణాదిలో ఎక్కడైన విద్యుత్తు అందుబాటులో లేదు. అయితే ఇతర గ్రిడ్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మిగులు విద్యుత్ ఉందని తెలిసి సంప్రదింపులు జరిపారు. అక్కడి నుంచి విద్యుత్తు తీసుకురావాలంటే డెడికేటెడ్ కారిడార్ అవసరం. దీని కోసం పి.జి.సి.ఐ.ఎల్. తో మాట్లాడి షరతుల ప్రకారం ఒప్పందాలు చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు సంస్థలతో పి.పి.ఎ. చేసుకోవడం, ఆ పి.పి.ఎ.ను సమర్పించి పి.జి.సి.ఐ.ఎల్ వద్ద కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది.


ఇవేవీ ప్రస్తావించకుండా మార్యా నుంచి విద్యుత్తు కొనుగోలు వ్యవహారాన్ని తప్పుబట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ చేసుకున్న ఎం.ఓ.యు.లోనే అప్కమింగ్ మార్యా ప్రాజెక్టు అని ఉంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించి మాట్లాడటం దురదృష్టకరం.
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు సరఫరా ప్రారంభమైన తర్వాత 1000 మెగావాట్ల కారిడార్‌ను ఉపయోగించుకున్నాం. తర్వాత ఆశించిన మేరకు కరెంటు సరఫరా కాకపోవడంతో రెండో 1000 మెగావాట్ల కారిడార్‌ను  రద్దు చేసుకున్నాం. దీని వల్ల తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు ఆర్థిక నష్టం జరగలేదు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ప్రజలు అవస్థలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చేపట్టిన చర్యలపై విమర్శలు చేయడం బాధాకరం. 


యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌ని దామరచెర్లలోనే ఎందుకు పెట్టాల్సివచ్చింది మీ విచారణాంశాల్లో ఉంది. ఒక విద్యుత్కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలన్నది ప్రభుత్వ విచక్షణ విషయం. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్కేంద్రం కూడా లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని దామరచర్లను ఉద్దేశపూర్వకంగానే ఎంపిక చేసింది. ప్రస్తుతం నిర్మించిన 4000 మెగావాట్ల ప్లాంటుతోపాటు, భవిష్యత్తులో దాని విస్తరణకు కూడా అక్కడ అవకాశం ఉన్నది. సోలార్ పవర్ ప్లాంటు పెట్టుకోవడానికి కూడా దామరచర్లలో వెసులుబాటు ఉన్నది.


దామరచర్లను ఎంపిక చేయడానికి మరికొన్ని వ్యూహాత్మక కారణాలూ ఉన్నాయి. సింగరేణి బొగ్గు గనులు తెలంగాణలోనే ఉన్నా ఆ బొగ్గును కేటాయించేది కేంద్రం. ఏదైనా కారణంతో బొగ్గు కొరత ఏర్పడినా, కేంద్రం కేటాయించకపోయినా విద్యుత్తు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. కృష్ణపట్నం, బందరు (మచిలీపట్నం) రేవుల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. నేషనల్ హైవేకు, రైల్వే లైన్‌కు సమీపంలోనే ఉంది. నాగార్జున సాగర్, టెయిల్పాండ్ నుంచి నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. ఫ్లెయాష్ను వాడుకునేది సిమెంటు పరిశ్రమలు దామరచర్ల సమీపంలోనే ఎక్కువగా ఉన్నాయి. 


బొగ్గు రవాణా వ్యయమే ప్రాతిపదిక అనుకుంటే రాయలసీమ ప్రాంతంలోని ముద్దనూరు పవర్ ప్లాంట్ ని బొగ్గు గనులకు 580 కిలోమీటర్ల దూరంలో ఎందుకు నిర్మించినట్టు? బొగ్గు గనులకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడలో ధర్మల్ ప్లాంట్ను ఎందుకు పెట్టినట్టు? హర్యానాలోని జజ్జర్లో, పంజాబ్లోని గోవింద్వాలా సాహెబ్, కర్ణాటకలోని రాయచూర్ (శక్తినగర్)లో, బళ్లారిలో, తమిళనాడులోని మెట్టూరులో ధర్మల్ ప్లాంట్లు ఎందుకు పెట్టినట్లు? ధర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ప్రాంతీయ మౌలిక సదుపాయాల సమతుల్యత, ఆర్థికాభివృద్ధి, లోడ్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ లాసెస్ని తగ్గించడం, విపత్తుల నివారణ అనేవి ప్రధాన ప్రాతిపదికలుగా ఉంటాయన్న వాస్తవాన్ని విస్మరించడం దురదృష్టకరం.


యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంటును నామినేషన్ పద్ధతిపై బి.హెచ్.ఇ.ఎల్కు ఇవ్వడంపై కూడా మీరు వ్యాఖ్యలు చేశారు. ధర్మల్ అయినా, హైడ్రో అయినా, న్యూక్లియర్ అయినా, భారీ విద్యుత్కేంద్రాల నిర్మాణానికి మన దేశంలోఉన్నది బీహెచ్‌ఈఎల్ ఒక్కటే. ఇటీవల తోషిబా, హిటాచి వంటి కొన్ని అంతర్జాతీయ ప్రైవేటు సంస్థలు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చినప్పటికీ, ఎక్కువ కాలం నిలవలేకపోయాయి. విద్యుత్కేంద్ర నిర్మాణాన్ని ఒక ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తున్నప్పుడు, దాన్ని నామినేషన్ పద్ధతిలో అయినా చేయవచ్చు, టెండర్ పద్ధతిలో అయినా చేయవచ్చు. అది చట్టబద్ధమే! నిజం ఏమిటంటే దేశంలోని అనేక కేంద్ర సంస్థలు, జెన్కోల వంటి రాష్ట్ర సంస్థలు, ఎన్.టి.పి.సి., చివరికి ప్రైవేటు కంపెనీలు కూడా నామినేషన్ పద్ధతిపై బి.హెచ్.ఇ.ఎల్క పనులు అప్పగించాయి.


అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాలనే మీ ప్రీ డిటర్మైన్డ్ మైండ్‌సెట్‌ని రుజువు చేస్తోంది. అందువల్ల విచారణ కమిషన్ బాధ్యతల్లో మీరు ఉండడం ఎంతమాత్రం సమంజసంకాదు. మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014కు ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లుండేదో, తర్వాత ఎట్లున్నదో తెలుసు. అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో చూశారు. లక్షల మోటార్లు కాలడం ఎలా ఆగిందో, జనరేటర్లు, ఇన్వర్జర్లు, కన్వర్టర్లు ఎలా మాయమయ్యాయో, డీజిల్‌తో నడిచే జెన్సెట్లు ఎలా మూలకు పడ్డాయో చూశారు. తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా ఎలా మార్మోగిందో గమనించారు.!


అయినా రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి, అన్ని రంగాలకూ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. దీన్ని తక్కువచేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదృష్టకరం అనుకుంటే, కమిషన్ చైర్మన్ గా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు, జూన్ 15లోగా నా అభిప్రాయాలను సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే విలేఖరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, పదేండ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం బాధ కలిగించింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరు పక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు, మధ్యవర్తిగా నిలిచి, అసలు నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. అన్ని విషయాలను, అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి, పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహారశైలి అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నాను. 


ఎంక్వయిర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా, మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు. ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టంచేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తి కాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్చందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను."