Telangana News : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి మధ్య చదివే విద్యార్థులకు ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. అయితే, తెలుగు పాఠ్యపుస్తకాల ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సహా పలువురు మంత్రుల పేర్లను ముద్రించిన వ్యవహారంలో విద్యాశాఖ గందరగోళంగా వ్యవహరిస్తోంది. స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడంలో విద్యాశాఖ విఫలం కావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ పుస్తకాల్లో కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లు ఉన్న విషయం తెలియగానే మొదట ఆ పేజీని చించివేయాలని అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అధికారులు ఆదేశాల మేరకు అనేక జిల్లాల్లోని అధికారులు ఆయా పేజీలను చింపివేశారు. అయితే, మళ్లీ డీఈవోలకు ఇచ్చిన ఆదేశాల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు భాషా పుస్తకాలను ఎమ్మార్సీలకు, జిల్లా గోడౌన్లకు రిటర్న్ చేయాలని గురువారం పేర్కొన్నారు. మళ్ళీ ఏమైందో కానీ శుక్రవారం తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కెసిఆర్ తోపాటు మాజీ మంత్రుల పేర్లు ఉన్న పేజీని కత్తిరించి కవర్ పేజీ వెనుక వైపు గమ్ తో లేదా ఫెవికాల్ తో అతికించాలని సూచించారు. రెండు, మూడు రోజులుగా భిన్నమైన ఆదేశాలను ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొన్ని స్కూళ్లలో తొలుత చింపి పారేసిన పేజీలు దొరకపోవడంతో టీచర్లు వాటిని జిరాక్స్ తీయించి అతికించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు ఆ పేజీని చింపి వేయాలని, ఆ తర్వాత పుస్తకాలను వెనక్కి ఇవ్వాలని, మళ్లీ అతికించాలని ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం విద్యా శాఖలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే పుస్తకాలు పంపిణీ..
రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పార్టీ పుస్తకాలను పంపిణీ చేసింది. అయితే, తెలుగు పుస్తకం ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉన్నాయన్న కారణంతో దాదాపు 25 లక్షల పుస్తకాలను వెనక్కి తెప్పించారు. ఆయా పుస్తకాలను ఎమ్మార్సీలకు, జిల్లా గోడౌన్లకు చేర్చారు. ఈ చర్యను మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా ఆక్షేపించారు.
గందరగోళంగా అధికారులు ఆదేశాలు
ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు ఇచ్చిన ఆదేశాలు అందరుగోళంగా మారాయి. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు వచ్చిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. 'ఈ సంవత్సరం అన్ని తెలుగు పాఠ్య పుస్తకాలపై పొరపాటున మాజీ మంత్రులు, అధికారుల పేర్లు ముద్రితమయ్యాయి. ఈ పేజీ వెనుక భాగంలో జాతీయగీతం, జాతీయ గేయం, ప్రతిజ్ఞ ఉన్నాయి. ఈ పేజీని బ్లేడ్ లేదా కత్తెరతో జాగ్రత్తగా కట్ చేయాలి. ఆ పేజీని అదే పుస్తకం కవర్ పేజీ వెనుక భాగంలో అతికించాలి. ఈ విధంగా చేసేటప్పుడు మాజీ మంత్రులు, అధికారులు పేర్లు ఉన్న పేజీ కనబడకుండా ఉండేలా జాతీయగీతం, జాతీయ గేయం, ప్రతిజ్ఞ కనిపించేలా జాగ్రత్త పడాలి' అని అధికారులకు సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పూర్తి చేయాలని పలు జిల్లాల డీఈవోలు ఆదేశాలు ఇచ్చారు. తమ కాంప్లెక్స్ పరిధిలోని పుస్తకాలను ఆయా హెచ్ఎంలు తమ వద్దకు తెప్పించుకొని పేజీని చింపి, అతికించి తిరిగి సంబంధిత స్కూల్లో ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని సూచించారు. శుక్రవారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, పూర్తయిన తరువాత తమ కాంప్లెక్స్ పరిధిలో అతికించడం పూర్తయిందని డెకరేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అధికారులు ఆదేశాలు గందరగోళంగా ఉండడంతో ఏం చేయాలో తెలియక హెచ్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నత స్థాయిలో జరిగిన తప్పిదంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
బాధ్యులైన అధికారులపై చర్యలు..
తెలుగు పాఠ్య పుస్తకాల్లో జరిగిన తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు టెక్స్ట్ బుక్ లో వచ్చిన తప్పులను సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్య పుస్తకాల బాధ్యతలు నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేష్ కు బాధితులు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ రమణ కుమార్ ముద్రణ సేవలు విభాగం డైరెక్టర్ గా బాధ్యతలు కేటాయించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు.