Reels Contest : సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత దాని ద్వారా తమ టాలెంట్ చూపించుకోవాలనుకునే యువతీ యువకులకు కొదవలేదు. ఫేస్ బుక్‌లో ఉండే లక్షల కొద్ది రీల్సే దీనికి సాక్ష్యం. ఓ రీల్ చేసి పోస్ట్ చేసి దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూసుకుని సంబరపడేవాళ్లంతా మన చుట్టూనే ఉంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ఓ ఆఫర్ కూడా వచ్చింది. మంచి రీల్ చేస్తే.. రూ. లక్ష బ హుమతి కూడా ఇస్తారు. ఆ వివరాలను తెలంగాణ డిజిటల్ మీడియా ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ రీల్స్ కాంటెస్ట్ ను ప్రకటించింది. ఈ రీల్స్ కాంటెస్ట్‌లో గెలిచిన వారికి లక్ష రూపాయలు ఇస్తారు. ఏమి చేయాలంటే.. హైదరాబాద్‌లో అద్భుతమైన ప్రదేశాలను ఎంపిక చేసుకుని రీల్స్ చేసుకోవడమే. హైదరాబాద్ మన జీవనానికి ఎంత అనుకూలంగా ఉంటుందో నిరూపించేలా రీల్స్ ఉంటే చాలు. అలా రీల్స్ తీసి... తమ సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని
@DigitalMediaTS కు ట్యాగ్ చేస్తే చాలు.
ఏప్రిల్ 30వ తేదీ వరకూ టైం ఉంది. ఒక్కో రీల్స్ అరవై సెకన్లకు మించకుండా ఉండాలి. ఇతర నియమ నిబంధనలు అన్నీ.. https://it.telangana.gov.in/contest/ లింక్‌లో చూడొచ్చు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో అనేక రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఏ మూలకు వెళ్లినా పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు ప్రారంభం అయ్యాయి. ఐటీ కారిడార్ అయితే పూర్తి స్థాయిలో విదేశీ నగరాల లుక్ సంతరించుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇవన్నీ హైలెట్ అయ్యేలా సోషల్ మీడియా యూజర్ల నుంచి మంచి ప్రచారం వచ్చేలా ఈ రీల్స్ కాంటెస్ట్ ను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.