YS Sharmila meets Professor Kodandaram: వైఎస్ఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. నాంపల్లిలోని టీజేఎస్ (TJS) పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆమె భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కలిసి పోరాటం చేసే అంశంపై ఇరువురూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోందని అన్నారు. అందరం కలిసికట్టుగా పని చేస్తే మంచిదని, అందుకోసం టీ - సేవ్ ఫోరం (T SAVE Forum) పేరుతో అందరం కలిసి పోరాడదామని అన్నారు. నిరుద్యోగులకు భరోసా కోసమే టీ సేవ్ ఫోరమ్ ఉద్దేశమని చెప్పారు. అయితే, వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ప్రొఫెసర్ కోదండరాం సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానని హామీ ఇచ్చినట్లు సమాచారం.


‘‘అన్ని పార్టీలు ఏకం అవ్వాలి. అన్ని పార్టీలు ఓకే వేదిక మీదకు వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. T - SAVE ఫోరం అధ్యక్షుడిగా ఉండాలని కోదండరాంను కోరాం. కోదండరాం సానుకూలంగా స్పందించారు. కలిసి కొట్లాడకపోతే నిరుద్యోగులకు న్యాయం జరగదు. ఎవరికి వారు పోరాటం చేసినా కేసీఅర్ అణచి వేస్తున్నారు. అందరం ఒక వేదిక మీదకు వస్తే వెంటనే న్యాయం జరుగుతుంది’’ అని షర్మిల మీడియాతో మాట్లాడారు.


ప్రొఫెసర్ కోదండరామ్ (Professor Kodandaram) మాట్లాడుతూ.. నిరుద్యోగుల తరపున కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎవరితో కలిసి పోవాలనేది తమ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కోదండరామ్ చెప్పారు. ఎవరితో కలిసి ఎలా పోరాటంలో ముందుకు వెళ్ళాలనేది టీజేఎస్ రాష్ట్ర కమిటీలో చర్చించుకుని మాట్లాడతామని అన్నారు. పదో తరగతికి సంబంధించి నిన్న, నేడు వరుసగా పేపర్ లీక్ కావడం ప్రభుత్వ నిర్లక్షమేనని విమర్శించారు. ఇవాళ సాయంత్రం అఖిలపక్ష ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.


‘‘T- SAVE లో భాగస్వామ్యం కావాలని షర్మిల అడిగారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడాల్సిన అవసరం ఉంది. షర్మిల ప్రతిపాదనల పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.


నిరుద్యోగుల కోసమే టీ - సేవ్: వైఎస్ షర్మిల (YS Sharmila)


వైఎస్ షర్మిల నిన్న (ఏప్రిల్ 3) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా ఉమ్మడిగా కలిసి పోరాడుదామని YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం T-SAVE (Telangana Students Action For Vacancies & Employment) అనే ఫోరంను ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగుల పక్షాన కలిసి పోరాడితేనే పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని, అప్పుడే యువతకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కేసులు, అరెస్టులు, హౌజ్ అరెస్టులతో కేసీఆర్ సర్కారు.. ప్రశ్నించకుండా నిర్బంధిస్తోందని, దీని నుంచి బయటపడి, పోరాడాలంటే అందరూ ఏకతాటి మీదికి రావాలని సూచించారు.