Jeedimetla News Today: హైదరాబాద్ శివారు ప్రాంతంలోని జీడిమెట్లలో మంగళవారం సాయంత్రం చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దూలపల్లి రోడ్డులో ఉండే ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మొత్తం మూడు ఫ్లోర్లు ఉండే ఈ భవనంలోని కింది అంతస్తులో మొదట మంటలు వచ్చాయి. మూడు ఫ్లోర్లకు అంటుకున్నాయి. ఇప్పుడు వాటిని ఆర్పేందుకు 20 గంటలకుపైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
ప్రమాదానికి కారణం ఇదేనా
ఇక్కడ సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్ పేరిట ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేస్తున్నాడు. మంటలు వ్యాపించిన తర్వాత పరిశ్రమలో ఉన్న ఆయిల్ ట్యాంక్ పేలిందని అంటున్నారు. అందుకే ఈ స్థాయిలో మంటలు వ్యాపించాయని సమాచారం. మంటలు అందుపులోకి వచ్చిన తర్వాత కానీ అక్కడ ఏం జరిగిందో చెప్పలేమంటున్నారు అధికారులు.
ప్రమాదంలో అగ్ని కీలల ధాటికి భవనం కొంతమేర కుప్పకూలింది. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ పరిశ్రమలో దాదాపు 500 మంది షిప్టులు వారీగా పని చేస్తుంటారు. ప్రమాదం జరిగే సమయంలో దాదాపు 200 మంది ఉన్నట్టు సమాచారం. అగ్ని ప్రమాదం జరిగిందని తెలియగానే కార్మికులంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
సాయంత్రానికి అదుపులోకి మంటలు
చిన్నగా మొదలైన మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో వెంటనే కార్మికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వాళ్లు వచ్చే వరకు కార్మికులు, స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమించారు. ప్రయోజనం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది కూడా కలుగుజేసుకున్నా మంటలు తీవ్ర తగ్గలేదు. రాత్రంతా శ్రమించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: యాదగిరిగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టివేత, నిందితులు అరెస్ట్- వాహనాలు స్వాధీనం
దట్టమైన పొగతో ఇబ్బందులు
ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. చుట్టుపక్కల పొగ కమ్మేసింది. ఎగసిపడుతున్న మంటలు చూసిన ప్రజలకు రాత్రంతా నిద్రపట్టలేదు. చుట్టుపక్కలో ఉన్న కొన్ని పరిశ్రమ యాజమాన్యాలు, కార్మికులు కూడా భయపడిపోయారు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. దాదాపు 10కిపైగా అగ్నిమాపక వాహనాలు మంటలు ఆర్పేందుకు నిరంతరంగా శ్రమిస్తున్నాయి. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. అగ్ని మాపక సిబ్బంది కూడా ఈ పొగతో ఇబ్బంది పడ్డారు. అటుగా వెళ్తే ఊపిరి ఆడలేదని కళ్లు విపరీతమైన మంటలు వచ్చాయని చెబుతున్నారు.
ప్రస్తుతానికి ఫర్వాలేదు
మూడో అంతస్థులో మంటలు ఆర్పడం అధికారులకు సవాల్‌గా మారింది. నీటిని చిమ్మడానికి ఇబ్బందిగా మారింది. దీంతో బ్రాంటో స్కైలిఫ్ట్ తీసుకొచ్చి మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతానికి మంటలు కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ పూర్తిగా ఇంకా పరిస్థితి సద్దుమణగలేదు. సాయంత్రానికి పరిస్థితి చక్కబడుతుందని అధికారులు చెబుతున్నారు.
ముందు జాగ్రత్తగా ఈ పరిశ్రమకు సమీపంలో ఉన్న సుభాష్ నగర్‌కు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. రాత్రి నుంచి వారికి విద్యుత్ లేదు. కొన్ని ఇళ్లను కూడా అధికారులు ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే అగ్ని కీలల ధాటికి ఒక భవనం ధ్వంసమైంది.
Also Read: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం