Telangana Politics | తెలంగాణలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీల మధ్య రోజు రోజుకు పొలిటికల్ వార్ తీవ్రమవుతోంది. రెండు పార్టీలకు చెందిన నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనపైన, ఇచ్చిన హమీల అమలు, హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేత, ఇళ్లు కూలిన బాధితుల విషయాలు, లగచర్ల అల్లర్ల ఘటన వంటి అంశాలపై ఇప్పటికే బీఆర్ఎస్ దూకుడుగా వెళుతోంది. మరో వైపు రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ మాటల దాడికి ప్రతి దాడి చేస్తూనే ఉన్నారు. అయితే ఇక ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందా అన్న చర్చ సాగుతోంది.
హైకోర్టు తీర్పుతో ఆపరేషన్ ఆకర్ష్ గేట్లు తెరిచినట్లేనా..?
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ ఇప్పటి దాకా పక్కన పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టనుందా అన్న చర్చ సాగుతోంది. కేసు పూర్వాపల్లోకి వెళితే.. తెలంగాణలో జరిగిన శాసన సభ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ బీఫాం అందుకుని గెలిచిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ లు కాంగ్రెస్ లో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణఅసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌషిక్ రెడ్డి, వివేకానంద రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపుపై సుప్రింకోర్టు మార్గదర్శకాలను స్పీకర్ అమలు చేయడం లేదని ఆ పిటిషన్ లో పిటీషనర్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. దీంతో అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టుడివిజన్ బెంచ్ ను ఆశ్రయించడం జరిగింది. అయితే దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఇరువర్గాల వాదన విన్న తర్వాత తన తీర్పును ప్రకటించింది.
రీజనబుల్ టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA)ల ఫిరాయింపు పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తన తీర్పులో పేర్కొంది. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు స్పష్టంగా ఎలాంటి గడువు విధించకపోవడం తో ఇక ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై తుది నిర్ణయం స్పీకర్ ఎప్పుడు తీసుకుంటారన్న స్పష్టత లేదు. ఇప్పటి వరకు హైకోర్టు నిర్ణయం పైవేచి చూసిన కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షక్ కు తెర లేపుతుందన్న వాదనలు వినవస్తున్నాయి.
రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా..?
తన ఢిల్లీ పర్యటన లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా కుటుంబ సభ్యుల వివాహ వేడుకలకు హజరయ్యేందుకే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ హై కమాండ్ తోను ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అందులో మంత్రి వర్గ విస్తరణ ఒకటి కాగా, మరో అంశం ఆపరేషన్ ఆకర్ష్. దీనికి కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనె బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే దిశగా చర్యలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
గతంలోనే పలువురు మంత్రులు 20-25 మంది గులాబీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వాళ్లు వస్తే ఇక బీఆర్ఎస్ లో మిగిలేది కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే అని చెప్పిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నిన్ననే (సోమవారం) ఢిల్లీ వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ తో ఈ తాజా పరిణామాలన్నీ చర్చించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
అసెంబ్లీ సమావేశాల ముందే జరుగుతుందా.. ? లేక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందా..?
బీఆర్ఎస్ దూకుడు తగ్గించేందుకు శీతాకాల అసెంబ్లీ సమావేశాల ముందే కొద్ది మందిని పార్టీలో చేర్చుకోవాలా లేక జీహెచ్ఎంసీ ఎన్నికల ముందా అన్న చర్చ జరుగుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ జరుగుతుందని చెబుతున్నారు. శాసన సభ ఎన్నికల్లో తెలంగాణ రూరల్ లో కాంగ్రెస్ కు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. కాని గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ చతికిల పడింది. కంటోన్మెంట్ కు జరిగిన ఉపఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచింది. దీంతో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి నజర్ పెట్టారు. అయితే గ్రేటర్ ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాసం ఉండటంతో శీతాకాల సమావేశాల ముందే ఈ ప్రక్రియ ఉండవచ్చన్న వార్తలు వస్తున్నాయి.
మంత్రివర్గ విస్తరణ ఆ తర్వాతేనా..?
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయి దాదాపు ఏడాది కావోస్తోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ముఖ్యమంత్రితో కలిపి 18 మందితో మంత్రి మండలి ఏర్పడాల్సి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సహా 12 మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది నుండి 12 మందితోనే రేవంత్ సర్కార్ పాలన సాగిస్తోంది. మరో ఆరుగురు మంత్రులుగా ఎంపిక కావాల్సి ఉంది. అయితే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఆరు మంత్రి పదవులు ఉద్దేశపూర్వకంగానే అలా అట్టిపెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీలో చేరిన ఒకరిద్దరు సీనియర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వాగ్ధానం చేసినట్లు ఆ ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. మరికొందరు పార్టీలోకి రావాలంటే మంత్రి పదవుల తాయిలం చూపించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేయకుండా ఆగారని అటు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు వాడుకుంటారా
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపాలంటే జీహెచ్ఎంసీ పరిధిలో మరి కొందరు సీనియర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పార్టీలో చేర్చుకునే వ్యూహంతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అవసరం అయితే వారికి మంత్రి పదవులు కట్టబెట్టి జీహెచ్ఎంసీ పీఠం కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు. అదే నిజమయితే త్వరలోనే గ్రేటర్ పరిధిలోని మాజీ మంత్రులు తిరిగి మంత్రి పదవులు దక్కించుకోవడం ఖాయం.
ఏది ఏమైనా అటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు. మరో వైపు పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు కావచ్చు ఆపరేన్ ఆకర్ష్ కు గేట్లు తీసిందనే చెప్పాలి. మరో వైపు బీఆర్ఎస్ దూకుడు తగ్గించేందుకు కూడా ఈ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి ఉపయోగించే అవకాశం ఉంది. అదే అయితే రానున్న రోజుల్లో తమ ఎమ్మెల్యేలను బీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్ ఎలా నిలువరిస్తారో వేచి చూడాలి.
Also Read: Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి