Telangana CM Revanth Reddy meets Union Minister Ram Mohan Naidu | న్యూఢిల్లీ: తెలంగాణ‌లో పారిశ్రామికాభివృద్ధి, ప్ర‌జ‌ల‌కు ర‌వాణా వ‌స‌తుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంద‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ మంగ‌ళ‌వారం సాయంత్రం క‌లిశారు. తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌లో విమానాశ్ర‌య ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన నిర‌భ్యంత‌ర ప‌త్రాన్ని (NOC) రాష్ట్ర ప్ర‌భుత్వం జీఎంఆర్ (GMR)  నుంచి (ఒక విమానాశ్ర‌యం నుంచి మ‌రో విమానాశ్ర‌యానికి 150 కి.మీ.దూరం ఉండాల‌నే నిబంధ‌న) పొందింద‌ని కేంద్రానికి రేవంత్ రెడ్డి తెలిపారు. 253 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన రూ.205 కోట్ల‌ను  భార‌త విమాన‌యాన సంస్థ (Airport Authority Of India)కి అంద‌జేసింద‌ని సీఎం వివ‌రించారు. వరంగల్ విమానాశ్ర‌య ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన అనుమ‌తులు, అక్క‌డి నుంచి విమానాలు న‌డిపేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు.


వరంగల్‌తో పాటు మరో 3 కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటుకు ప్రతిపాదన 


భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో విమానాశ్ర‌య ఏర్పాటుకు గ‌తంలో గుర్తించిన స్థ‌లం అనువుగా లేదు. దానికి ప్ర‌త్యామ్నాయంగా  పాల్వంచ‌లో 950 ఎక‌రాలు గుర్తించామ‌ని రామ్మోహ‌న్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ భూమి వివ‌రాలు ఏఏఐ (AAI) అంద‌జేశామ‌ని, వెంట‌నే విమానాశ్ర‌య ఏర్పాటుకు అనుమ‌తులు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. పెద్ద‌ప‌ల్లి జిల్లాలో గ‌తంలో గుర్తించిన భూమి విమానాశ్ర‌య నిర్మాణానికి అనువుగా లేద‌ని ఏఏఐ ప్రీ-ఫీజుబిలిటీ స‌ర్వేలో తేలింద‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు రేవంత్ రెడ్డి తెలిపారు. దానికి ప్ర‌త్యామ్నాయంగా అంత‌ర్గాంలో 591.24 ఎక‌రాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింద‌ని... అక్క‌డి విమానాశ్ర‌య ఏర్పాటుకు అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరారు.


భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని స్పష్టత


ఆదిలాబాద్‌లో భార‌త వైమానిక ద‌ళం (IAF) ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే 369.50 ఎక‌రాల భూమి ఉంది. పూర్తి స్థాయి కార్య‌క‌లాపాల‌కు అద‌నంగా 249.82 ఎక‌రాలు అవ‌స‌ర‌మ‌ని రామ్మోహ‌న్ నాయుడుకు తెలంగాణ సీఎం తెలిపారు. అద‌నంగా అవ‌స‌ర‌మైన భూమి సేక‌రించి అప్ప‌గించేందుకు తమ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని  వివ‌రించారు. గిరిజ‌నులు ఎక్కువ‌గా ఉంటే ఆదిలాబాద్ కు వెంట‌నే విమానాశ్ర‌యం మంజూరు చేయాల‌ని రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రుల‌ను సీఎం రేవంత్ రెడ్డి క‌లిసిన కార్య‌క్ర‌మాల్లో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, ఎంపీలు కె.ర‌ఘువీర్ రెడ్డి, ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, చామ‌ల కిర‌ణ్‌ కుమార్ రెడ్డి, ఆర్‌.రఘురామిరెడ్డి, డాక్ట‌ర్ క‌డియం కావ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.




బాపూఘాట్ అభివృద్ధికి 222.27 ఎక‌రాలు బదిలీ చేయండి - రేవంత్ రెడ్డి


బాపూ ఘాట్ అభివృద్ధికి ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని 222.27 ఎక‌రాల భూమిని తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌లో ఈసా, మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లంలోని భూమిని బదిలీ చేయాలని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి కోరారు. మ‌హాత్మా గాంధీ చితాభ‌స్మాన్ని క‌లిపిన‌ చోట ఏర్పాటు చేసిన బాపూ ఘాట్ ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్విక‌త‌ను చాటే కేంద్రం (Mahatma Gandhi Ideology Center)గా  తీర్చిదిద్దాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.



ఢిల్లీలో రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం సాయంత్రం క‌లిశారు. బాపూ ఘాట్ వ‌ద్ద గాంధీ సిద్దాంతాల‌ను ప్ర‌చారం చేసే నాలెడ్జ్ హ‌బ్‌, ధ్యాన గ్రామం (మెడిటేష‌న్ విలేజ్‌), చేనేత ప్ర‌చార కేంద్రం, ప్ర‌జా వినోద స్థ‌లాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్ర‌హం (Statue Of Peace), మ్యూజియంల‌తో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును చేప‌ట్టనున్నామ‌ని రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించారు. ఇందుకోసం ర‌క్ష‌ణ శాఖ (Defence Lands) భూమిని బ‌దిలీ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 


Also Read: KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?