Telangana Fire Department: 2023తో పోలిస్తే రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల సంఖ్య తగ్గిందని తెలంగాణ అగ్నిమాపకశాఖ చెబుతోంది. రెస్క్యూ ఆపరేషన్లు కూడా పటిష్టంగా చేపట్టామంటున్నారు అధికారులు. 2023 సంవత్సరంలో మొత్తం 7400 ఫైర్ కాల్స్ వస్తే... ఏడాది 7383కు తగ్గాయి. ఇందులో చిన్నవి 7093, మధ్యస్థంగా ఉన్నవి 180, సీరియస్ 87, మేజర్ 24 కాల్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. గతేడాదితో పోల్చినప్పుడు మీడియం ప్రమాదాల కాల్స్ 5.9శాతం పెరిగాయి. ఈ ఏడాది రెస్క్యూ కాల్స్ సంఖ్య పెరిగింది.
ఈ ఏడాదిలో వరద ప్రమాదాల్లో 1767 మందిని రక్షించామన్నారు అధికారులు అగ్ని ప్రమాదాల నుంచి 495 మందిని, లిఫ్ట్ రెస్కూ ద్వారా 40మందిని, ఇతర ప్రమాదాల్లో 54 మందిని రక్షించామన్నారు. 103 జంతువులను ప్రమాదాల బారిన నుంచి రక్షించారు. గతేడాది రెస్క్యూ కాల్స్ సంఖ్య 2292 ఉంటే ఈ ఏడాది 2356 కాల్స్ వచ్చాయి. రెస్క్యూ కాల్స్ 7.29శాతం పెరిగాయి. 2023 సంవత్సరంలో అత్యవసర కాల్స్ 499 హాజరుకాగా ఈ ఏడాది ఈ కాల్స్ సంఖ్య 10.82శాతం పెరిగాయి. డెడ్ బాడీ రికవరీ సంఖ్య 441, ఎమర్జెన్సీ కాల్స్ విషయాని కొస్తే వాహన ప్రమాదాలు 28, రోడ్డు ప్రమాదాలు 25, భవనం కూలిన ఘటనలు సంఖ్య 10కి చేరుకుంది.
ఈ ఏడాది అగ్నిమాపకశాఖ ఆకస్మిక తనిఖీలు, అవగాహాన కార్యక్రమాలు...
తెలంగాణా వ్యాప్తంగా 42,772 ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్విహించింది అగ్నిమాపకశాఖ. 19,581 పరిశ్రమలు, 6370 విద్యాసంస్దలు, 6331 రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, 846379 ఇతర సంస్థలతో కలపి మొత్తంగా ఈ ఏడాది 1కోటి 57 లక్షల 8వేల 433 సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. అవగాహాన కార్యక్రమాలు 2023వ సంవత్సరంలో 4641 నిర్వహించగా ఆ సంఖ్య 2024 సంవత్సరంలో 81.71శాితం పెరిగింది.
అగ్నిమాపకశాఖ సాధించిన విజయాల్లో...
రంగారెడ్డిజిల్లాలోని గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అగ్నిమాపక సేవలకు ఫిబ్రవరి 18, 2024న అగ్నిమాపకశాఖ కోసం ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని ఫెట్సియాలో నూతనంగా నిర్మించిన సనత్ నగర్ ఫైర్ స్టేషన్ భవనాన్ని ఇదే రోజు ప్రారంభించారు.
ఈ ఏడాది అగ్నిమాపక శాఖకు వచ్చిన ఆదాయం ఎంతంటే..
2024 ఏడాది జనవరి 1వ తేది నుంచి 17వ తేది డిసెంబర్ వరకూ అగ్నిమాపక శాఖ విధించిన వివిధ ఫైన్‌ల ద్వారా శాఖకు మొత్తంగా సమకూరిన ఆదాయం 34.79 కోట్ల రూపాయలు. ఇందులో అత్యధికంగా ఫైర్ లైసెన్స్ (క్రాకర్స్ ) నుంచి 7కోట్లపై ఆదాయం రాగా, ప్రొవిజనల్ ఎన్ ఓసీపై కోటిన్నర వరకూ ఆదాయం సమకూరింది.
అగ్నిమాపకశాఖకు పెరిగిన బడ్జట్ కేటాయింపులు..
ఈ ఏడాది అగ్నిమాపకశాఖ ప్రభుత్వం నుంచి 180.40 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించగా ,రాబోయే 2025 ఏడాదికి ఆ సంఖ్యను పెంచింది. వచ్చే ఏడాదికి 198.47కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో సిబ్బంది జీతభత్యాలకు 126.46కోట్లు, వేతనాలు లేని వారికి 45.62 కోట్లు, వివిధ పథకాలకు 26.39 కోట్ల రూపాయలుగా నిర్దారించారు.
ఇవే భవిష్యత్ ప్రణాళికలు..
హైదరాబాద్ పాటు తెలంగాణవ్యాప్తంగా అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్ 1999ను సవరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది అగ్నిమాపక శాఖ. వేగంగా పెరుగుతున్న బహుళఅంతస్దు భవనాలు, రియల్ ఎస్టేట్‌లో పెరుగుదలతో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిన నేపథ్యంలో ఫైర్ సర్వీసెస్ యాక్ట్‌ను సవరించాల్సిన అవసరంపై ప్రతిపాదనలు. అగ్నిమాపక శాఖలో సైతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం.