సైబరాబాద్ పోలీసులకు ఓ ఆసక్తికరమైన ఫిర్యాదు అందింది. దానిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అది ఏంటంటే.. పూజలు చేస్తే.. పాస్ అంటూ.. చెప్పిన ఓ దొంగ బాబాను నమ్మింది మహిళ. అలా.. 80వేల రూపాయల వరకూ సమర్పించుకుంది. అయినా రెండుసార్లు ఫెయిల్ కావడంతో ఇక పోలీసులను ఆశ్రయించింది.
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ మహిళ కొండాపూర్‌లో ఉంటోంది. 2011లో విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని స్వదేశానికొచ్చింది. పలుమార్లు ఎఫ్‌ఎంజీఈ పరీక్షలకు హాజరైనా ఉత్తీర్ణత కాలేదు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన పట్టభద్రులు మన దగ్గర ప్రాక్టీస్ చేయాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. అయితే తను ఈ పరీక్ష ఎంతకూ పాస్ కాకపోవడంతో.. ఎలాగైనా పాస్ అవ్వాలి అనుకుంది. ఇలా ఆమె బాధపడుతున్న సమయంలోనే బాధితురాలి సోదరికి ఓ రోజు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్ట్ కనిపించింది. బిస్వజిత్ ఝా అనే స్వామిజీ పూజ చేస్తే చాలూ.. ఎలాంటి పరీక్షయినా పాస్ అయిపోవచ్చని.. ఉంది.
ఇక అలా పాస్ అయిపోతారు అనగానే.. వెంటనే దొంగ స్వామీజీ ఫేస్‌బుక్ ఖాతాను దొరకబట్టింది. హాయ్ అంటూ మెసేజ్ పెట్టింది. ఇలాంటి వాళ్ల కోసమే వెయిట్ చేస్తున్న దొంగబాబా నుంచి స్పీడ్ గా రిప్లై వచ్చింది. సోదరి పడుతున్న ఇబ్బంది గురించి తెలిపింది. ఇక స్వామీజీ మెుదలుపెట్టాడు... జాతక దోషాలున్నాయి.. అందుకే ఇలా జరుగుతుందంటూ.. సొల్లు చెప్పాడు. బాధితురాలి సోదరి.. స్వామిజీ మాటలు నమ్మేసింది. తన సోదరి నంబర్ స్వామీజికి ఇచ్చింది.
లేట్ చేయకుండా స్వామీజీ టీం రంగంలోకి దిగింది. బాధితురాలి వివరాలు తెలుసుకుంది. ఆమె హాల్ టిక్కెట్ ఫొటో తీసి వాట్సాప్‌లో పంపించింది. పూజ చేయాలంటే కొంత ఖర్చవుతుందని నమ్మించారు. ఆమె రూ.21,500 ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన పరీక్షలో పాస్ కాలేదు. పూజ చేసిన పాస్ కాలదేంటని.. ఇలా ఎందుకు జరిగిందంటూ స్వామిజీని అడిగింది. పూజలో లోపం జరిగిందంటూ నమ్మించాడు. అసలు సిసలైన ఒక పూజ ఉందని చెప్పాడు.
కాలభైరవ ప్రత్యేక పూజ చేద్దామంటూ తెలిపాడు. ఇది చేస్తే పాస్ పక్కా.. టాప్ ర్యాంక్ వస్తుందంటూ.. చెప్పాడు. బాధితురాలు మళ్లీ నమ్మింది. అలా ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు పంపించింది. అయితే మళ్లీ ఆమె పాస్ కాలేదు. మీరేమో పాస్ అవుతానని చెప్పారు.. కానీ ఇంకా పాస్ కాలేదేంటని.. స్వామీజీని అడిగింది. ఇంకేం.. ఇక దొంగ బాబా నుంచి నో రెస్పాన్స్. ఆ మహిళకు అప్పుడు అర్థమైంది తాను మోసపోయినట్లు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ దొంగ బాబా చేతిలో ఇంకా కొంతమంది కూడా మోసపోయినట్లు పోలీసులకు తెలిసింది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.