హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యంతో బాలింత చనిపోయింది. శస్త్ర చికిత్స సమయంలో ఇచ్చే అనస్థీషియా మోతాదు ఎక్కువ కావడంతో ప్రతిభ అనే ఓ గర్భిణీ తొలుత కోమాలోకి వెళ్లింది. దీంతో డాక్టర్ హడావుడిగా ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు పుట్టిన పండంటి బిడ్డ కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడు. పరిస్థితి విషమించడంతో ఇద్దర్నీ మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్‌లో ఉన్న అరుణ హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


హైదరాబాద్‌లోనే మరో ఘటనలో ఇలా..
మరోవైపు, హైదరాబాద్‌ సోమాజిగూడలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. వారు ఏకంగా పేషెంట్ బతికున్నా చనిపోయారని చెప్పారు. శనివారం ఈ ఘటన జరిగింది. చనిపోయాడని బంధువులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. చివరికి బతికి ఉన్నట్లు తేలింది.


హైదరాబాద్‌ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని సిబ్బంది చెప్పారు. దీంతో రోగి కుటుంబ సభ్యులు ఏడుస్తూ వారి బంధువులకు కూడా సమాచారం ఇచ్చేశారు. ఆ తర్వాత రోగి శ్వాస తీసుకోవడం గమనించి పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా పల్స్‌ చెక్‌ చేయగా 95 చూపించింది. దీంతో వారు నిర్ఘాంతపోయి ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. సనత్‌ నగర్‌కు చెందిన మహేందర్‌ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చి గత మూడు రోజుల క్రితం చేర్పించారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి రోగికి చికిత్స అందిస్తున్నారు. ఆ చికిత్స కోసం వారు అప్పటికే రూ.3.5 లక్షలను చెల్లించారు. శనివారం మధ్యాహ్నం మహేందర్‌ చనిపోయాడని చెప్పి వెంటిలేటర్‌ తొలగించి ఆస్పత్రి సిబ్బంది రోగిని బయటకు తీసుకువచ్చారు.


అంత్యక్రియలకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా మహేందర్‌ శ్వాస తీసుకోవడాన్ని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పల్స్‌ చూడగా బతికే ఉన్నాడని తెలిసింది. దీంతో ఫ్యామిలీ రోగి ఎలా చనిపోయాడని చెబుతారని వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. ఆస్పత్రి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించారు. చివరికి సిబ్బంది రోగికి తిరిగి చికిత్స అందించారు.