తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఇక్కడ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. వీరి పర్యటన తేదీలు నేడు ఖరారు అయ్యాయి. వచ్చే నెల అక్టోబర్‌ 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఎన్నికల అధికారులు పర్యటించనున్నారు. తెలంగాణలో వీరు ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వీరు రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంటారు.


అంతేకాకుండా, ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా వంటి నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో కూడా ఎన్నికల సంఘం అధికారులు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో ప్రలోభాల కోసం ఉపయోగించే డబ్బు, లిక్కర్, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల నోడల్‌ అధికారులతో సమావేశం జరుపుతారు. భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై రివ్యూ చేస్తారు. 


రెండో రోజు అన్ని జిల్లాల్లోని ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఈసీ బృందం భేటీ అవుతుంది. జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లను రివ్యూ చేయనున్నారు. మూడో రోజు మాత్రం తెలంగాణ రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.