Mahesh Bank ED Raids : హైదరాబాద్ నగరంలోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. బ్యాంకుకు సంబంధించిన ఆరు ప్రాంతాల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టింది. మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, ఎండీ పురుషోత్తం దాస్, సీఈవో, డైరెక్టర్ల ఇళ్లతో పాటు సోలిపురం వెంకట్ రెడ్డి ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించింది. మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.300 కోట్ల నిధుల గోల్ మాల్‌పై హైదరాబాద్ సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించినట్లు సమాచారం. భారీగా అనర్హులకు రుణాలు ఇచ్చి.. హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు రోజులుగా ఈడీ అధికారులు చేస్తున్న సోదాల్లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. బ్యాంక్ ఉద్యోగులు కుమ్మక్కై భారీ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్‌కు సంబంధించిన నిధులను భారీగా దారిమళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ అధికారులు మహేష్ బ్యాంక్‌లో సోదాలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈడీ ఏం చెప్పిందంటే..
కంపెనీలోని వాటాదారులు ఇతరులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున రుణాలను అనర్హులను ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు నగరంలో కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై ఈడీకి సమాచారం అందడంతో సోదాలు నిర్వహించారు. బ్యాంక్‌లో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు బయటపెట్టారు. రెండు రోజుల పాటు బ్యాంక్‌లో సోదాలు చేసినట్లు తెలిపారు. ఈ సోదాల్లో కోటి రూపాయిల నగదుతో పాటు ఐదు కోట్ల రూపాయిల విలువైనటు వంటి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనర్హులకు 300 కోట్ల రూపాయల మేర రుణాలు ఇచ్చినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఏకంగా 1800 మందికి డమ్మీ గోల్డ్‌లోన్స్ ఇచ్చినట్లు తమ సోదాల్లో తేలిందన్నారు. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు తేలిందన్నారు. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నారని ఈడీ అధికారులు తెలిపారు. బ్యాంక్‌లోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ ప్రకటించింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని, వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన పలు ఆస్తులకు రుణాలు ఇచ్చారని ఈడీ పేర్కొంది.
గత రెండు రోజులు సోదాలు
మహేష్ కో-ఆపరేటీవ్ బ్యాంకు నిధుల గోల్‌మాల్ కేసులో బ్యాంకు ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. నకిలీ పత్రాలు సృష్టించడం, నిబంధనలకు విరుద్ధంగా రూ.300 కోట్లకుపైగా రుణాల మంజూరు, బ్యాంకు నుంచి రూ.18.30 కోట్లు దారి మళ్లింపు ఆరోపణలపై ఈడీ విచారిస్తోంది. మహేష్ బ్యాంక్ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఆ సంస్థ సైబర్ సెక్యూరిటీని పట్టించుకోలేదు. ఈ కారణంగా బ్యాంక్ సర్వర్లపై సైబర్ దాడులు జరిగాయి. నైజీరియా నుంచి సైబర్ దాడులు జరిగి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్ సైబర్ పోలీసులు అసలు విషయం తేల్చేశారు. మహేశ్ బ్యాంక్ యాజమాన్యం సైబర్ సెక్యూరిటీపై నిర్లక్ష్యం చేసిందని, అందువల్లే సర్వర్ హ్యాక్ చేసి నగదు పెద్ద ఎత్తున ట్రాన్స్ ఫర్ జరిగిందని దర్యాప్తులో తేలింది. నైజీరియాకు చెందిన హ్యాకర్లు మొదట బ్యాంకు ఉద్యోగులకు మెయిల్స్, మెస్సేజ్ లు పంపి తరువాత బ్యాంకు సర్వర్‌లోకి చొరబడి పలు ఖాతాలకు కొల్లగొట్టిన నగదును ట్రాన్స్ ఫర్ చేశారు.