ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ధరణి పోర్టల్ ను భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా ఆమోదముద్ర వేశారు. ఇందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పన కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అటు గౌరవెల్లి ప్రాజెక్టుకు రూ.437 కోట్ల కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జాబ్ క్యాలెండర్ కు కూడా ఆమోదం తెలిపారు.
జీహెచ్‌ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
క్రీడాకారులకు ఇళ్ల స్థలాలు, ఉద్యోగం
కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈషాసింగ్, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో 600 చదరపు గజాల ఇళ్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నారు.
జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాల విలీనం
జీహెచ్‌ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను మళ్లీ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తూ గవర్నర్ కు పంపుతున్నట్లుగా చెప్పారు. ‘‘అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నాం. విధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం, మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, హైదరాబాద్‌లో మూసీ నది సుందరీకరణ వంటి విషయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు తరలిస్తాం’’ అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.