CM Revanth Reddy Comments In Telangana Assembly 2024: బీఆర్ఎస్ అక్కలను అడ్డం పెట్టుకుని రాజకీయ చేస్తోందని.. సభను స్తంభింప చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని సొంత అక్కలుగానేభావించానని.. ఓ అక్క తనను నడి బజారులో వదిలేసినా ఏం అనలేదని అన్నారు. మరో అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లానని.. అప్పటి కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు చెప్పారు. ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తేయాలని ఎప్పుడైనా చెప్పారా.? అంటూ సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దని ఆ అక్కలకు చెబుతున్నట్లు పేర్కొన్నారు. 'పార్టీని వదిలి వెళ్లిన వారిలో ఒకరు మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి తెచ్చుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలో ఉన్నారు. ఇక ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారు. మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తీహాడ్ జైలులో ఉన్నారు.' అంటూ సీఎం వ్యాఖ్యానించారు.


'ఆదివాసీ బిడ్డను అవమానించారు'


తన కుటుంబ సభ్యురాలు, ఆదివాసీ బిడ్డ సీతక్కను ఎంతో అవమానకరంగా మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అవమానించేలా సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టారని.. ఇదేనా మీ నీతి అంటూ ప్రశ్నించారు. తాను మహిళలను గౌరవిస్తానని.. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులయ్యారని అన్నారు. దళితుడైన స్పీకర్ ముందు కింద కూర్చోవడం ఇష్టం లేకే కేసీఆర్ సభకు రాలేదని ధ్వజమెత్తారు. దళితుడిని అధ్యక్షా అనే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చిందని అన్నారు. 'బీఆర్ఎస్ దళిత వ్యక్తిని సీఎంను చేస్తానని మోసం చేసింది. దళితునికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి బర్తరఫ్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ఏఐసీసీ అధ్యక్షునిగా ఖర్గేను నియమించారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌ను చేశారు.' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 


సభలో గందరగోళం


అంతకు ముందు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ బయటకు తీసుకొచ్చారు. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనంటూ శాసనసభ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనిల్ జాదవ్‌లను పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో వారు 'సీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. 


మరోవైపు, శాసనసభలో స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన వీడియోలు లీక్ కావడంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వీడియోలు తీయాలంటే స్పీకర్ అనుమతి ఉండాలి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఆయన వీడియో తీసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: Revanth Reddy : రాజీవ్ గాంధీ వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి - స్కిల్ యూనివర్శిటీ బిల్లుపై చర్చలో తేల్చేసిన రేవంత్