Rajiv Gandhi developed IT sector in Hyderabad Says Revanth  :  హైదరాబాద్‌లో  సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధికి రాజీవ్ గాంధీ కారణమని రేవంత్ రెడ్డి అన్నారు.  ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి.. వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని..  ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారన్నారు.  రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.  హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఆనాడు రాజీవ్ గాంధీ పునాదులు వేశారని..  
ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మన విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో స్కిల్ యూనివర్శిటీ బిల్లుపై మాట్లాడారు. 


స్కిల్స్ లేకపోవడం వల్లే పెరుగుతున్న నిరుద్యోగం             


ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందని..  వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందన్నారు.  అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.  యంగ్ ఇండియా పత్రిక మహాత్మాగాంధీ మొదలు పెట్టారు. మహాత్మాగాంధీ స్పూర్తితో యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోబోతున్నామని..  లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పించడమే స్కిల్స్ యూనివర్సిటీ ఉద్దేశమని ప్రకటించారు.  స్కిల్స్ 17 కోర్సులను యూనివర్శిటీలో ప్రవేశపెట్టనున్నామని..  స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందిస్తామన్నారు. 


ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్శిటి కోర్సులు                                  
 
ఈ సంవత్సరం 6కోర్సులకు రెండువేల మందికి అడ్మిషన్స్ కు అవకాశం ఇస్తున్నామని..  శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు.  భవిష్యత్ లో జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.  బీఆరెస్ నేతలకు రాజకీయ ప్రయోజనం తప్ప.. ప్రజల ప్రయోజనం పట్టదు..రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆరెస్ నేతలు ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.  స్కిల్స్ యూనివర్సిటీపై చర్చ జరగకూడదని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.    ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులతో వాదించేలా కృషి చేశామని..  దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.  కానీ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయారు..  అందుకే వాళ్ల నుంచి ఏమైనా ఆశిస్తే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనన్నారు.  వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.   


హైదరాబాద్ ఐటీ అభివృద్ధి పూర్తిగా కాంగ్రెస్ ఘనతేనని రేవంత్ భావన


హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి తన ఘనతేనని ఎవరికి వారు చెప్పుకుంటూ ఉంటారు. ఈ జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంటారు. అయితే చంద్రబాబు కాదని. ముందుగా నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఐటీ రంగానికి  పునాదులు వేశారని కొంత మంది వాదిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వీరెవరూ కాదు.. రాజీవ్ గాంధీ అని చెప్పడంతో కొత్త చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి.