Draupadi Murmu in Telangana: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై.. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. హకీంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ ద్రౌపది ముర్మును స్వాగతించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి అభివాదం చేశారు. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసైతో పాటు సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు సంతోష్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు నవీన్, శంభిపూర్ రాజు కూడా ద్రౌపది ముర్ముకు పుష్ప గుచ్ఛాలు అందించారు. 






దేశ స్వాతంత్ర్యం కోసం, స్వయం పాలనకోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటీష్ పరాయి పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామ రాజు త్యాగం గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో వారి అమరత్వం అజరామరమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. గిరిజనుల హక్కుల సాధన కోసం, నాటి పరాయి పాలకులైన బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లూరి ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమైనవన్నారు. సీతారామ రాజు వంటి వీరుల స్ఫూర్తితో ఎందరో దేశ పౌరులు నాటి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. భారత రాష్ట్రపతి పాల్గొంటున్న, చారిత్రక సందర్భమైన అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ గడ్డమీద హైదరాబాద్ లో నిర్వహించుకోవడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రజలకోసం పోరాడే త్యాగ ధనుల జీవితాలు విశ్వజనీనమైన స్ఫూర్తిని పంచుతాయని, వారి త్యాగాలను స్మరించుకుంటూ రేపటి తరాలు ముందుకు సాగాలని సీఎం తెలిపారు.