Journalist Injured in Mohan Babu Attack at His home: హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు చేసిన దాడిలో గాయపడిన జర్నలిస్టుకు వైద్యులు సర్జరీ చేశారు. జర్నలిస్ట్ రంజిత్‌కు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్లు సర్జరీ పూర్తి చేశారు. రెండు, మూడుచోట్ల ఫ్రాక్చర్ అయిన జైగోమాటిక్ ఎముకకు వైద్యులు సర్జరీ చేశారు. మరో మూడు, నాలుగు రోజులు ఆ జర్నలిస్టును అబ్వరేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలిపారు. జర్నలిస్టుకు మెదడు, తలలో అంతర్గతంగా ఏమైనా డ్యామేజీ జరిగిందా అని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఏమైనా సమస్య తలెత్తుతుందా అని టెన్షన్ పడుతున్నారని సమాచారం.
న్యూస్ కవరేజ్ కోసం జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసానికి మంగళవారం సాయంత్రం వెళ్లిన సమయంలో మీడియా ప్రతినిధి రంజిత్‌పై నటుడు ఒక్కసారిగా దాడి చేయడం కలకలం రేపింది. నమస్తే అంటూ జర్నలిస్ట్ వద్దకు వచ్చిన మోహన్ బాబు ఒక్కసారిగా రంజిత్ చేతిలో ఉన్న న్యూస్ కవర్ చేస్తున్న మైకును లాక్కున్నారు. అంతటితో ఆగకుండా తీవ్ర ఆవేశంతో జర్నలిస్టు తలపై కొట్టడంతో అంతర్గతంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం జర్నలిస్టును హాస్పిటల్ తరలించగా పరీక్షించిన డాక్టర్లు ఆయనకు జైగోమాటిక్ బోన్ ఫ్యాక్చర్ అయినట్టుగా నిర్ధారించారు. సర్జరీ సైతం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు డాక్టర్లు ఆ జర్నలిస్టుకు సర్జరీ చేసి బోన్ ఫ్రాక్చర్ సరిచేశారు. అయితే మూడు, నాలుగు రోజులు వైద్య పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని, కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
Also Read: Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేసిన దాడిని జర్నలిస్టు సంఘాలతో పాటు పలు సొసైటీలు, నేతలు సైతం తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం నిరంతరం వార్తలు చేరువ చేసే వారిపై దాడులకు దిగడం హేయమైన చర్య అని విమర్శిస్తున్నారు. జర్నలిస్టులకు మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వయసులో అంత పెద్ద వ్యక్తి, సుదీర్ఘమైన అనుభవం ఉన్న మోహన్ బాబు ఆవేశానికి లోనై జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించి, దాడులు చేయడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట
మరోవైపు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై డిసెంబర్ 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. మోహన్ బాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై బుధవారం విచారించిన హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసిందే. నిన్న జల్‌పల్లిలోని ఆయన ఫాం హౌస్ వద్ద జరిగిన ఘటనలో ఆయనకు కంటి కింద స్వల్ప గాయం కాగా, మరోవైపు హై బీపీతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని, అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు ప్రకటించారు. మంచు వివాదంలో మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్‌లకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీపీ కార్యాలయంలో హాజరైన మనోజ్ శాంతిభద్రతల సమస్య సృష్టించబోనని రూ.1 లక్ష రూపాయలకు బాండ్ ఇచ్చారు. పోలీసుల ఎదుట తాను హాజరు కావాల్సిన అవసరం లేదని మంచు విష్ణు పేర్కొన్నారు.