Fish Prasad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు గ్రౌండ్‌కు చేరుకున్న మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రసాదం కోసం రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దానికి సరిపడా ఏర్పాట్లు చేసింది.
మూడేళ్ల విరామం తర్వాత ఈ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. అందుకే భారీగా గురువారమే ప్రజలకు తరలి వచ్చారు. దీంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాలతోపాటు వేర్వేరు రాష్ట్రాల నుంచి కూడా జనం తరలి వచ్చారు. ఇంకా వస్తున్నారు.
భారీగా తరలి వస్తున్న వేళ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రజలకు సమస్యలు రాకుండా ఉండేందుకు స్వచ్చంద సంస్థల సాయం కూడా పోలీసులు తీసుకుంటున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
చేప ప్రసాదం కోసం భారీ సంఖ్యలో జనం రావడంతో గురువారం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ అర్థరాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్లే వెహికల్స్‌ను అబిడ్స్ జీపీవో, నాంపల్లి స్టేషన్ మీదుగా పోనిస్తారు. బేగంబజార్ ఛత్రి, ఎంజే బ్రిడ్జి నుంచి నాంపల్లి వైపు వచ్చే వెహికల్స్‌ను దారుసలాం, ఏక్ మినార్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అసెంబ్లీ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్, అఫ్జల్‌గంజ్ వైపు వచ్చే వెహికల్స్ ను బషీర్‌బాగ్ ఏఆర్ పెట్రోల్ పంప్, బీజేఆర్ విగ్రహం మీదుగా డైవర్ట్ చేస్తున్నారు.
పార్కింగ్ ఏరియాలు ఇవే
చేప ప్రసాదం తీసుకునేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించారు పోలీసులు. నాంపల్లిలోని గృహకల్ప, గగన్ విహార్, చంద్రవిహార్, ఎంఏఎం గర్ల్స్ జూనియర్ కాలేజీ, ఇంటర్ బోర్డు వద్ద వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. భారీ వాహనాలను మాత్రం గోషామహాల్ పోలీస్ స్టేడియంలో పార్క్ చేయాలి. బైక్‌లను భీమ్ నగర్, గృహకల్ప, బీజేపీ ఆఫీస్ వద్ద మాత్రమే పార్క్ చేయాలి. పాస్‌లు ఉన్న వీఐపీలు తమ వాహనాలను సీడబ్ల్యూసీ గోడౌన్స్ పార్కింగ్ ఏరియాలో ఉంచాలి.
మూడేళ్ల తర్వాత భారీ ఎత్తున చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు చేయూత అందిస్తున్నాయి. ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన ప్రజలకు టిఫెన్స్, భోజనలు, మంచినీళ్లు, మజ్జిగను అందిస్తున్నాయి. తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసింది. అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉంచింది. ఎలాంటి సమస్య ఉన్నా కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు పోలీసులు