Telangana Assembly Elections: తెలంగాణలో శాంతియుతమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక దృష్టి సారించామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో పటిష్టమైన నిఘా పెడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో షెడ్యూల్ చేయని చార్టర్డ్ విమానాల రాకపోకలపైనా, డిజిటల్ చెల్లింపులపైనా నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. డిజిటల్ వాలెట్లు, యూపీఐ ద్వారా చెల్లింపులను అరికట్టాలని బ్యాంకులను ఆదేశించారు. మద్యం నిల్వలు, ఉచిత వస్తువుల కోసం ఉపయోగించే గోదాములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. డబ్బు, మద్యం, ఉచితాల వంటి ప్రలోభాలకు తావులేకుండా స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 


2018 ఎన్నికలతో పాటు మునుగోడు, ఇతర ఉప ఎన్నికల సమయంలో చార్టర్డ్ విమానాలతో డబ్బు పంపిణీ జరిగిందని, ఓటుకు నోటు కోసం డిజిటల్ చెల్లింపులు వినియోగించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఈసారి ఆయా మార్గాలపైనా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 


డిజిటల్ వాలెట్లు, యూపీఐ ద్వారా చెల్లింపులను గుర్తించడంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహాయపడుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రావజీ కుమార్ తెలిపారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (SLBC) కూడా  అనుమానిత ఓటుకు డబ్బు పంపినవారి, అందుకున్న వారి ఇద్దరి బ్యాంకింగ్ లావాదేవీలనను పరిశీలించాలని సీఈసీ ఆదేశించింది.


చెక్ పోస్ట్ ల దగ్గర పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని, మొదటిసారి ఫారెస్ట్ చెక్ పోస్టులు పెట్టామని తెలిపారు. ప్రతీ చెక్ వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఫాల్స్ అఫిడవిట్ పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ అఫిడవిట్ పూర్తిగా ఆన్‌లైన్‌లో పెడతామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించాలని రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 


తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల ఓట్లను డిలీట్ చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రావజీ కుమార్ తెలిపారు. ఈ సారి 8.11 లక్షల మొదటిసారి ఓటర్లను నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. యువత-మహిళా  ఓట్లను పెంచేందుకు ఎంతగానో కృషి చేసినట్లు తెలిపారు. 3.45 లక్షల యంగ్ విమెన్ ఓట్లు నమోదు అయ్యాయన్నారు. 


ప్రలోభాలపై పోలీసులకు సూచనలు


ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించింది సీఈసీ. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ప్రలోభాల విషయమై అధికారులను కాస్త గట్టిగానే అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దేశంలోనే ఎక్కువగా ఎన్నికల వ్యయం అయ్యే రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్న ఈసీ బృందం, ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకునే మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఫిర్యాదులు పెద్ద మొత్తంలో వస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో అందుకు అనుగుణంగా డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, కానుకలు స్వాధీనం చేసుకోవడం లేదని అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.  


ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలంటే ప్రలోభాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ఈసీ అభిప్రాయపడింది. అధికారులు కూడా అందుకు అనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో క్రమంగా ఎన్నికల హింస తగ్గుతోందని, ఇదే సమయంలో ప్రలోభాలు పెరుగుతున్నాయని, హింస తగ్గేందుకు డబ్బు, మద్యం పంపిణీ కూడా ఒక కారణమని అధికారుల సమీక్షలో వ్యాఖ్యానించినట్లు సమాచారం.