Dharani Portal In Telangana: ధరణి పోర్టల్ వివాదం తెలంగాణలో పెను రాజకీయ ప్రకంపనలనే రేపుతోంది. ఇటీవల నిర్మల్ కలెక్టరేట్ ప్రారంభం, నాగర్ కర్నూల్ లో కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పై చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రతిపక్ష పార్టీలలో కాకరేపుతున్నాయి. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపేద్దాం అన్న పార్టీలనే బంగాళాఖాతంలో కలిపేయాలంటూ కాంగ్రెస్, బీజేపీలపై అగ్గిమీద గుగ్గిలంలా రెచ్చిపోయారు సీఎం కేసీఆర్. ధరణి పోర్టల్ గ్రామీణ స్థాయిలో అవినీతి వ్యవస్థకు చెక్ పెట్టిందని కేసీఆర్ అంటున్నారు.


గత ప్రభుత్వాల హయాంలో రైతులు తమ భూములపై హక్కు పొందేందుకు, పాస్ బుక్ లో తమ భూములు నమోదు చేయించుకునేందుకు చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేదని, ధరణి పోర్టల్ వచ్చాక ఆ పరిస్థితి మారిపోందంటున్నారు. కేవలం ధరణి పోర్టల్ కారణంగా రైతులకు రైతు భరోసా మొదలు రైతు భీమా వరకు బటన్ నొక్కిన వెంటనే నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరుతోందన్నారు. గత ప్రభుత్వాల్లో జరిగిన వీఆర్వోల దోపిడీకి ధరణి పోర్టల్ వల్లనే చెక్ పెట్టగలిగామని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. రైతుల భూములు ఒక్కసారి ధరణి పోర్టల్ లో నమోదైతే, వాటిని మార్చాలంటే ఎమ్మార్వో నుంచి రెవెన్యూ శాఖ మంత్రివరకు సైతం  ఎవరూ మార్చలేరని, చివరికి సీఎం కేసీఆర్ సైతం మార్చడం సాధ్యంకాదన్నారు. కేవలం రైతు మాత్రమే తన వేలిముద్రతో మార్పులు చేసుకోవడం సాధ్యమవుతుందని.. అంతలా రైతు భూములను పారదర్శకంగా డిజిటలైజేషన్ చేశామంటున్నారు కేసీఆర్.


అధికారపార్టీ బీఆర్ఎస్ వాదన ఇలా ఉంటే.. ప్రతిపక్ష పార్టీల గొంతు మరోలా వినిపిస్తోంది. ధరణి పోర్టల్ వల్ల అనేక అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్, బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. హక్కుదారుడి పేరుతో పట్టా ఉండి, కొన్ని దశాబ్దాలుగా భూమి సాగు చేస్తున్నా ధరణి పోర్టల్ లో మాత్రం హక్కుదారుడి పేరుతో కాకుండా వేరే వారి పేరుతో సాగుభూమి నమోదవుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మండలాల్లో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ఆపరేటర్ల వ్యవస్థలో అనేక లోపాలున్నాయంటున్నారు. భూములు రికార్డుల నుండి తొలగించి, వాటిని ధరణిలో చేర్చాలంటే లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ కొందరు ఆపరేటర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు.


వ్యవసాయ భూములు డిజిటలైజేషన్ చేయడం ద్వారా నేరుగా లబ్దిదారులైన రైతులకే ప్రభుత్వ పథకాలు వర్తించేలా చేయడంతో పాటు ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలకు చెక్ పెట్టాలనేది బీఆర్ఎస్ సర్కార్ ఉద్దేశ్యం. ఆలోచన మంచిదే అయినా ఆచరణలో సమస్యలు తలెత్తితే విమర్శలు తప్పదు.  ధరణి పోర్టల్ విషయంలో ఇదే జరుగుతోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం సంకల్పం మంచిదైనా క్షేత్రస్థాయిలో లబ్దిదారులు సమస్యలు ఎదుర్కోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది.


ధరణి పోర్టల్ వేగంగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మండలానికో ఆపరేటర్లను నియమించింది కేసీఆర్‌ సర్కార్. ఎమ్మార్వోలకు సహకరిస్తూ సాంకేతిక లోపాలను సరిదిద్దుతూ రైతుల భూములను డిజిటలైజేషన్ చేయాలి. కానీ ఇప్పడు అదే ఆపరేటర్ల వ్యవస్థ ధరణి పోర్టల్ ఇంతలా విమర్మలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. రికార్టులలో ఉన్న భూములు తొలగించి, తిరిగి వాటిని చేర్చడానికి లంచాలు డిమాండ్ చేయడమనేది ప్రధానంగా ధరణిపై వస్తున్న ఆరోపణ. రహదారుల ప్రక్కన ఉన్న భూములను ధరణి పోర్టల్ లో కలిపేయడం, భూ యజమానికి సమాచారం లేకుండా హక్కుదారుల పేర్లు తొలిగించడం, భూయజమాని బ్రతికే ఉన్నా.. చనిపోయినట్లుగా చిత్రీకరించి, ఆ భూమిని మరొకరిపేరుతో ధరణి పోర్టల్ లో నమోదు చేయడం ఇలా ఒకటేమిటి అనేక అవకతవకలున్నాయంటున్నాయి ప్రతిపక్షపార్టీలు.


తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతోంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ సైతం నిరసనలు, ఆరోపణలతో ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది. అయితే ప్రతిపక్ష పార్టీలకు గట్టి  కౌంటర్ ఇవ్వడంతోపాటు ధరణి పోర్టల్ విషయంలో వెనక్కు తగ్గబోమన్నట్లుగా తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ధరణి పోర్టల్ ఎత్తివేస్తే తిరిగి మళ్లీ జమిందారీ వ్యవస్ద వస్తుంది. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్దితి ఏర్పడుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలు సైతం ధరణి పోర్టల్ పై ప్రశంసల కురిపిస్తున్నాయి.  సమస్యలు పరిష్కరిస్తాం కానీ ధరణి పోర్టల్ ఎత్తివేసే ప్రసక్తేలేదంటోంది బీఆర్ఎస్.


ధరణి పోర్టల్ అంశంపై సీఎం కేసీఆర్ పదే పదే వ్యాఖ్యలతో తెలంగాణలో మరోసారి ధరణి పొర్టల్ పొలిటిక్ అగ్గి రాజేయడంతోపాటు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన అస్త్రంలా మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.