Just In
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Telangana News: తెలంగాణాలో ఖనిజ సంపద ఆదాయం గత పదేళ్లలో గణనీయంగా పెరుగుదల సాధించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలో 32 ప్రధాన ఖనిజ బ్లాక్‌లను వేలం వేయబోతున్నట్లు చెప్పారు.
Deputy CM Bhatti Vikramarka Comments On Mineral Blocks: తెలంగాణ ఖనిజ సంపదలో అగ్రగామిగా దూసుకుపోతోంది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు రూ.2 వేల కోట్లు కూడా లేని ఖనిజ సంపద నుంచి వచ్చే ఆదాయం ఇప్పుడు ఏకంగా రూ.5 వేల కోట్లు దాటింది. రాష్ట్రంలో లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్డ్జ్, గ్రానైట్, రోడ్డు మెటల్, డోలమైట్ తదితర పెద్ద, చిన్న ఖనిజ నిక్షేపాలతో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి. ఇదే విషయాన్ని సోమవారం ఒడిశాలోని కోణార్క్‌లో జరిగిన మూడో జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మంత్రులు ప్రతినిధులుగా పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణా ఖనిజ సంపద వేగంగా అభివృద్ది చెందిన తీరును ఆయన వివరించారు. రాష్ట్రంలో 2014లో ఖనిజ ఆదాయం రూ.1,958 కోట్లు ఉండగా 2023 - 24 నాటికి రూ.5,540 కోట్లకు ఆదాయం పెరిగిందని తెలిపారు.
'32 ఖనిజ బ్లాకులకు వేలం'
2024-25, 2025- 26 సంవత్సరాల్లో లైమ్ స్టోన్, మాంగనీస్ వంటి 32 పెద్ద ఖనిజ బ్లాకులను వేలం వేయాలన్న కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. 'భారత దేశంలో ఖనిజ రంగం అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది అనేక అవకాశాలను మన ముంగిట్లోకి తెస్తుంది. దేశంలో ఖనిజాలు అనేవి విలువైన ప్రకృతి సంపదలు, అవి ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడుతున్నాయి. ఖనిజాల అన్వేషణ, అకర్షణ, నిర్వహణ అనేవి జాతీయ, రాష్ట్ర లక్ష్యాల ప్రకారం ఉండాలి. ఖనిజాలు ఆర్థిక అభివృద్ధి యొక్క సమగ్ర వ్యూహంలో భాగస్వామ్యంగా ఉండి, దేశీయ పరిశ్రమను ప్రోత్సహించేందుకు మరియు దిగుమతిపై ఆదారపడటాన్ని తగ్గించేందుకు దోహదపడాలి.' అని భట్టి పేర్కొన్నారు.
ఆచార్య కౌటిల్యుడు, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో, తన అర్థశాస్త్రంలో, “ఖనిజ సంపదలు దేశం శక్తి, శౌర్యాన్ని సూచిస్తాయి” అని పేర్కొన్న విషయాన్ని సమావేశంలో భట్టి ప్రస్తావించారు. 'తెలంగాణలో మొత్తం 2,552 మైనింగ్, ఖనిజ గనుల లీజులు ఉన్నాయి. నదీ తీరంలోని మట్టి/మెట్ట ఖనిజాల కోసం ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాం. ఇసుకను ప్రజలకు పారదర్శకంగా, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తున్నాం. 2024లో సూర్యాపేట జిల్లాలో 2 లైమ్‌స్టోన్ బ్లాక్‌లను వేలం వేసి విజయవంతమైన బిడ్డర్లకు పత్రాలను జారీ చేశాం. చిన్న ఖనిజాల లీజుల మంజూరు విషయంలో, అవసరమైన అనుమతులతో కూడిన బ్లాక్‌ల వేలం విధానాన్ని రాష్ట్రం అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఖనిజ వనరుల ఆడిట్ కోసం DGPS సర్వే, ETS సర్వే పూర్తి చేశాం. DMF (జిల్లా ఖనిజ ఫౌండేషన్): 2015 నుంచి ఇప్పటివరకు రూ. 5,537 కోట్లు వసూలు చేసింది. ఈ నిధిని ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు ప్రాధాన్యతా రంగాల్లో వినియోగిస్తున్నాం. ఇటువంటి సమావేశాలు ఖనిజ సంపదల అన్వేషణ, వినియోగం, అభివృద్ధి, ఖనిజ రంగంలో దేశవ్యాప్తంగా ప్రగతి సాధించడంలో కీలకంగా మారుతాయి.' అని భట్టి పేర్కొన్నారు.
Also Read: Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !