Police arrest female doctor addicted to drugs: హైదరాబాద్ పోలీసులు శుక్రవారం ఓ డ్రగ్స్ రాకెట్ లో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఒకరు ఓ యువతి..మరొకరు డ్రగ్స్ కొరియర్. పక్కా సమాచారంతో డ్రగ్స్ డెలివరీ తీసుకుంటున్నప్పుడు అరెస్టు చేశారు. ఆమె ఎవరో తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ లో ఉన్న ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి హాస్పిటల్ యజమాని అయిన వైద్యుడి కుమార్తె నమ్రత చిగురుపాటి. ఆమె కూడా స్వయంగా డాక్టర్. ఆస్పత్రి సీఈవోగా కూడా వ్యవహరించారు. పోలీసులు ఆమెను పట్టుకున్నప్పుడు ఐదు లక్షల రూపాయల విలువైన సరుకును డెలివరీ తీసుకుంటోంది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. కానీ ఆమె పరిస్థితి చూసి.. రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాల్సి వచ్చింది. ముంబైలోని ఓ పబ్ లో ఆమెకు డ్రగ్స్ అలవాటు అయినట్లుగా తెలుస్తోంది.
డాక్టర్ నమ్రత ముంబై నుండి వాట్సాప్ ద్వారా వంశ్ ధక్కర్‌ను సంప్రదించి రూ.5 లక్షల విలువైన కొకైన్ ఆర్డర్ చేశారు. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ చేసి, వంశ్ కింద పనిచేస్తున్న డెలివరీ ఏజెంట్ బాలకృష్ణ అలియాస్ రాంప్యార్ రామ్ ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను డెలివరీ చేశారు. సమాచారం అందడంతో రాయదుర్గం పోలీసులు గురువారం సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో మాదకద్రవ్యాలను అందజేసేటప్పుడు నమ్రత , బాలకృష్ణ ఇద్దరినీ అరెస్టు చేశారు, వారు 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అనుమానితుల నుండి 53 గ్రాముల కొకైన్, రూ.10,000 నగదు మరియు రెండు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో, డాక్టర్ నమ్రత ఏడాదిలో దాదాపు రూ.70 లక్షలు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు అంగీకరించారు. ధనవంతుల కుటుంబం కావడంతో చేతిలో కావాల్సినంత డబ్బు ఉండటంతో దాన్ని దురలవాట్ల కోసం మహిళా వైద్యురాలు ఉపయోగించడం ప్రారంభించారు. ముంబైలోని ఓ పబ్ లో పరిచయం అయిన వ్యక్తితో డ్రగ్స్ అలవాటు చేసుకుని దాన్ని వ్యసనంగా మార్చుకున్నారు.
డాక్టర్ నమ్రత ఓమెగా ఆస్పత్రి సీఈవోగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారాన్ని ఆ ఆస్పత్రి ఖండిచింది. ఆ ఆస్పత్రి వ్యవహారాలతో ఆమెకు సంబంధం లేదని.. ఆమె వ్యక్తిగత వ్యవహారాలతో ఆస్పత్రికి అసలు సంబంధం లేదని తెలిపింది. ఓమెగా ఆస్పత్రి మేనేజింగ్ డైరక్టర్ సీహెచ్ మోహనవంశీ ఈ మేరకు వివరణ ఇచ్చారు. వ్యక్తిగత విషయాలను ఆస్పత్రికి ఆపాదించవద్దని విజ్ఞప్తి చేశారు.