CBI Action on Cyber Crime: సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు వంటి కేసులను నివారించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మరో కీలక చర్య తీసుకుంది. ఆపరేషన్ చక్ర-V కింద, దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో CBI ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 5 మంది కీలక వ్యక్తులను అరెస్టు చేసింది. టెలికాం కంపెనీల పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లు పనిచేస్తున్న ప్రదేశాల్లో CBI ఈ దాడులు నిర్వహించింది. వీరు మోసపూరితంగా సిమ్ కార్డులు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
8 రాష్ట్రాల్లోని 42 ప్రదేశాలలో దాడులు
అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని మొత్తం 42 ప్రదేశాల్లో CBI ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ సమయంలో 38 PoS ఏజెంట్ల స్థానాల్లో సోదాలు చేసింది. ఈ ఏజెంట్లు, సైబర్ నేరస్థులతో కలిసి, నకిలీ KYC పత్రాల సహాయంతో సిమ్ కార్డులు జారీ చేస్తున్నారని CBI అనుమానిస్తోంది. తరువాత వాటిని మోసం, ఇతర కేసుల్లో ఉపయోగిస్తున్నారు.
CBI చర్యలో ముఖ్యమైన ఆధారాలు లభ్యం
ఈ దాడి సమయంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నకిలీ KYC పత్రాలు, అనేక మంది అనుమానిత వ్యక్తుల సమాచారంతో సహా అనేక ముఖ్యమైన ఆధారాలు CBI స్వాధీనం చేసుకుంది. దీనితో పాటు, మధ్యవర్తుల పాత్ర పోషిస్తున్న ఇలాంటి అనేక మంది వ్యక్తులను కూడా గుర్తించారు.
అరెస్టు అయిన వ్యక్తులు టెలికాం కంపెనీల నిబంధనలను ఉల్లంఘన
CBI అరెస్టు చేసిన 5 మంది వ్యక్తులు 4 వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు. వారందరూ టెలికాం కంపెనీల నిబంధనలను ఉల్లంఘించారని, సిమ్ కార్డులను మోసపూరితంగా విక్రయించారని ఆరోపించారు.తరువాత వీటిని UPI మోసం, డిజిటల్ అరెస్ట్, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్స్ , ఐడెంటీ చోరీ వంటి సైబర్ నేరాల్లో ఉపయోగించారు. ప్రస్తుతం, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు వెల్లడి కావచ్చు.