Medak MP receives threatening call: మెదక్ లోక్‌సభ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో నిన్ను లేపేస్తాం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఆపరేషన్ కగార్ ఆపాలని డిమాండ్ చేయడంతో పాటు తమ టీంలు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాయని కాల్ చేసి హెచ్చరించారు. దమ్ముంటే కాపాడుకో అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు రెండు నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మెదక్ ఎంపీకి ఆరు రోజుల కిందట (జూన్ 23న) మధ్యాహ్నం బెదిరింపు కాల్ రావడం తెలిసిందే. మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టులం కాల్ చేస్తున్నాన్నమని చెప్పాడు. సాయంత్రంలోగా నిన్ను చంపేస్తాం, దమ్ముంటే ప్రాణాలు కాపాడుకో అని రఘునందన్ రావును హెచ్చరించారు. మేడ్చల్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో రఘునందన్ రావు పీఏ నెంబర్ కు కాల్ వచ్చింది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపేయడం తక్షణం ఆపాలని మావోయిస్టు డిమాండ్ చేశారు. కేంద్రం సైతం మావోయిస్టులను వరుస ఎన్ కౌంటర్లు చేయడం, ఆపై చర్చలకు లేఖలు రావడం తెలిసిందే. కానీ 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ తమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారు. ఛత్తీస్ గఢ్ లోని అడవులను జల్లెడపట్టి పలు ప్రాంతాలను సాయుధ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.