Telangana Bonalu 2025 : తెలంగాణ అంతటా బోనాలు ప్రారంభమయ్యాయి. 2025లో జూన్ 29వ తేదీ ఆదివారం నుంచి వీటిని జరుపుకోనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో వీటిని అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో మహాకాళి దేవిని పూజిస్తూ.. ఆషాడ మాస బోనాలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అసలు ఈ పండుగ స్పెషల్ ఏంటి? చరిత్ర, ముఖ్యమైన తేదీలు, ఇతర ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
తెలంగాణ సంస్కృతిని ప్రదర్శిస్తూ.. మహాకాళి దేవిని పూజిస్తూ భక్తులు ఈ బోనాలు నిర్వహిస్తారు. పండుగ రోజులలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి ఏడాది ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ బోనాలు 2025లో జూన్ 29న ప్రారంభమై.. జూలై 20వ తేదీన ముగియనున్నాయి. ఆదివారంతో మొదలై.. ఆదివారంతోనే ఇవి ముగుస్తాయి. అసలు ఈ బోనం అంటే అర్థమేంటి? ఇతర ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
బోనం అంటే అర్థమిదే..
బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. దేవతలకు ఇచ్చే నైవేద్యాలలో ఒకటి. మట్టి లేదా ఇత్తడి కుండలలో పాలు, బెల్లంతో వండిన అన్నాన్ని వండుతారు. ఇలా వండిన బోనాన్ని వేప, పసుపు, సింధూరంతో అలంకరిస్తారు. వెలిగించని దీపాన్ని బోనంపై ఉంచి.. దానిని అమ్మవారికి తీసుకెళ్లి సమర్పిస్తారు. భక్తులు భక్తి శ్రద్ధలతో మహాకాళిని పూజించి.. ఈ బోనాలు సమర్పిస్తారు. అందుకే ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు.
బోనాల చరిత్ర..
సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో 1813లో ఓ అంటువ్యాధి ప్రబలింది. ఆ సమయంలో వేలాది మంది చనిపోవడంతో తగ్గాలని కోరుకుంటూ.. మహాకాళి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆ వ్యాధి వ్యాప్తి తగ్గడంతో అమ్మవారి విగ్రహాన్ని సికింద్రాబాద్‌లో ప్రతిష్టించారు. అప్పటి నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ.. దీనిని నిర్వహిస్తున్నారు.
ఈ బోనాల సమయంలో మహిళలు అందంగా ముస్తాబవుతారు. సాంప్రదాయ గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే బోనాలు తీసుకెళ్లేవారి పాదాలపై నీటిని చల్లి.. శాంతపరుస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
ఆషాడంలో మొదటి గురువారం నుంచి ఈ బోనాల సందడి మొదలవుతుంది. ఈ ఏడాదిలో జూన్ 26వ తేదీన గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఇస్తారు. జూన్ 29వ తేదీన విజయవాడ కనకదుర్గకు 2వ బోనం సమర్పిస్తారు. 3వ బోనాన్ని జూలై 3వ తేదీన, నాల్గవ బోనాన్ని జూలై 6వ తేదీన పెద్దమ్మ తల్లికి అందిస్తారు. 5వ బోనం జూలై 10వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి సమర్పిస్తారు.
జూలై 13వ తేదీన సికింద్రాబాద్‌లో బోనాల జాతర చేస్తారు. జూలై 14వ తేదీన అమ్మవారి ఊరేగింపు చేస్తారు. 15వ తారీఖున చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి 6వ బోనం సమర్పిస్తారు. 17వ తేదీన లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారికి చివరి బోనం సమర్పిస్తారు. 20వ తేదీన పాతబస్తీ, లాల్ దర్వాజాలో బోనాల జాతర చేస్తారు. 21వ తేదీన పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు చేసి బోనాలు ముగిస్తారు.