Golden and Crispy Kunafa Dessert Recipe : ఇన్​స్టాగ్రామ్​లో ఈ మధ్య ఓ రెసిపీ తెగ వైరల్ అవుతుంది. అదే కునాఫా. క్రిస్పీగా, చీజీగా ఉండే ఈ కునాఫా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్లు అందుబాటులో ఉంటుంది. అయితే మీరు దీనిని తినాలంటే షాప్స్​కే వెళ్లాల్సిన అవసరం లేదు. కావాల్సిన పదార్థాలు ఉంటే ఇంట్లోనే దీనిని ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి. కునాఫా చేసేప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి వంటి విషయాలు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

పాల పేనీలు - 200 గ్రాములు

బటర్ - 3 టేబుల్ స్పూన్లు

పాలు - అర కప్పు

మిల్క్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు

మొక్కజొన్న పిండి - 1 టేబుల్ స్పూన్

పంచదార - 1 టేబుల్ స్పూన్

ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు

వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్

పంచదార - అరకప్పు

నీళ్లు - అరకప్పు

నిమ్మరసం - 4 చుక్కలు

కుంకుమ పువ్వు - చిటికెడు

వెన్న -1 టేబుల్ స్పూన్ 

చీజ్ - అరకప్పు

పిస్తా - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా పేనీలు తీసుకోవాలి. దీనిని సన్నని సేమ్యా అని కూడా అంటారు. ఇవి నార్మల్​వి ఉంటాయి. రోస్ట్ చేసినవి కూడా ఉంటాయి. రోస్ట్ చేసినవి తీసుకుంటే ఈ రెసిపీ మరింత తక్కువ సమయంలో ఫినిష్ చేయగలుగుతారు. కాబట్టి రోస్ట్ చేసిన పేనీలు తీసుకోండి. ఇప్పుడు వాటిని చిన్నగా అయ్యేలా క్రష్ చేయండి. దానిలో బటర్ వేసి.. మొత్తం కలిసేలా..  చిన్న చిన్న సేమ్యా ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు ఓ గిన్నెలో కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. దానిలో మిల్క్ పౌడర్, మొక్కజొన్న పిండి, పంచదార, ఫ్రెష్ క్రీమ్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు స్టౌవ్ పెట్టి మంటను మీడియంలో ఉంచి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. లేదంటే ఉండలుగా పేరుకుపోతుంది. పాల మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి. చల్లగా మారేవరకు కూడా దానిని కలుపుతూనే ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. 

మిశ్రమం చల్లారిన తర్వాత ఓ గిన్నెలో పంచదార, నీళ్లు వేసి గులాబ్ జామున్ సిరప్​లా తయారు చేసుకోవాలి. పాకం మరీ తీగలా కాకుండా అలా అని పలుచగా కాకుండా కాస్త చిక్కగా మారేలా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి దానిలో నాలుగు చుక్కలు నిమ్మరసం వేయాలి. రుచికోసం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్​ని పక్కనపెట్టి.. ఇప్పుడు ఓ పాన్ తీసుకోవాలి. దానికి వెన్న పూయాలి. 

బటర్ రాసిన పాన్​లో ముందుగా సిద్ధం చేసుకున్న పేనీలు ఓ అంగుళం వేయాలి. అనంతరం పాలతో చేసిన క్రీమ్ వేయాలి. దానిని ఓ లేయర్​గా పేర్చి.. దానిపై చీజ్ వేయాలి. అనంతరం మిగిలిన పేనీలు మరో లేయర్​గా వేసి.. దానిపై మూత పెట్టి స్టౌవ్ వెలిగించాలి. కింద రోస్ట్ అయ్యాక.. మరో పాన్​కి వెన్న రాసి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ అయిన దానిని మరోవైపు రోస్ట్ చేయడం కోసం వెన్న రాసిన పాన్​లోకి మార్చాలి. 

రెండోవైపు కూడా రోస్ట్ అయిపోతే టేస్టీ, క్రిస్పీ కునాఫా రెడీ. ఈ డిజెర్ట్​ని తినేముందు పిస్తా క్రస్ట్ వేసుకుని.. దానిపై షుగర్ సిరప్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కునాఫా రెడీ. క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ వీకెండ్ మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి.