Praja Palana Application Dead Line Ends Today: తెలంగాణలో ఆరు గ్యారంటీల కోసం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ప్రారంభమైన తొలి రోజు నుంచే జనాల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. డిసెంబల్ 28 నుంచి ప్రజాపాలన కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది.
7 రోజుల్లో కోటి అప్లికేషన్లు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటీ 8 లక్షల 94వేల 115 ప్రజాపాలన దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇందులో ఆరు గ్యారంటీల కోసం 93లక్షల 38వేల111 అప్లికేషన్‌లు వచ్చాయి. 15,55, 704 దరఖాస్తులు ఇతర అంశాలపై అర్జీలుగా అధికారులు తెలిపారు. చివరి రోజు కావడంతో శనివారం మరిన్ని దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతిగ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం
ఇప్పటి వరకు పన్నెండు వేలకుపైగా గ్రామ పంచాయితీల్లో మూడు వేలకుపైగా మన్సిపాలిటీ వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28న ప్రారంభమైన ప్రజాపాలన డిసెంబర్ 31, జనవరి 1 న మాత్రమే సెలవు ఇచ్చారు. అంటే సుమారు వారం రోజుల పాటు సాగిందీ కార్యక్రమం.
నాలుగు నెలలకోసారి ప్రజాపాలన
అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు మరిన్ని ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నాలుగు నెలలకోసారి నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామసభల్లో దరఖాస్తు ఇచ్చేందుకు వీలు పడని వాళ్లు స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీస్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
17 నాటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ దిశగానే చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు అందుకున్న దరఖాస్తులను స్క్రూట్నీ చేసే ప్రక్రియను చేపట్టింది. వీటిని ముందు ఆన్‌లైన్ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఆ పని ప్రారంభిస్తారు. ఆ ప్రక్రియను సంక్రాంతి తర్వాత అంటే జనవరి 17 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెటుకున్నారు.
గ్రేటర్‌లో రేషన్ కార్డులకు డిమాండ్
గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో 500పైగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు 21 లక్షల 52 వేల 178 అప్లికేషన్‌లు వచ్చాయి. ఇందులో నాలుగు లక్షల దరఖాస్తులు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని రిక్వస్ట్‌లే. ఇందులో ఎక్కువ పాతబస్తీ నుంచి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
డీటీపీ ఆపరేటర్లకు శిక్షణ
వచ్చిన అప్లికేషన్‌లను ఆన్‌లైన్ చేయడానికి భారీగా డీటీపీ ఆపరేటర్లను నియమించింది ప్రభుత్వం. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారితో వేగంగా పని జరగకపోతే మరికొంతమందిని నియమించాలని కూడా భావిస్తోంది. ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వారి అర్హతలను ఎలా నిర్ణయిస్తుందనే విషయంపై మాత్రం వివరాలు వెల్లడించలేదు. వచ్చే నెల నుంచి మహిళలకు 2500వేలు ఇస్తామని ప్రకటించిన వేళ అసలు ఎవరికి వస్తుంది ఈ పథకం కోసం ఎలాంటి అర్హతలు తెరపైకి తీసుకొస్తారనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది.