Nampally Exhibition: హైదరాబాద్: హైదరాబాద్ లో ని నాంపల్లి లో 83వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ -2024 (Numaish Exhibition 2024)ను రాష్ట్ర మంత్రి సి. దామోదర రాజనర్సింహ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ - యశోద హాస్పిటల్స్ సంయుక్తంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య కేంద్రం (Health Center) ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర నర్సింహ ప్రారంభించారు.


ఈ సందర్బంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా మాత, శిశు సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 83 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా సుమారు 30 వేల మంది విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు విద్యను అందిస్తున్నందుకు అభినందించారు. 


యశోద ఆసుపత్రి ప్రారంభించి 30 ఏండ్లు పూర్తి  చేసుకున్న సందర్భంగా 83వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ -2024 లో 'వైద్య ఆరోగ్య కేంద్రం' ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. వారు అందిస్తున్న సేవలను మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు . వైద్య ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం లో ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ సెక్రెటరీ హనుమంత్రావు, ఉపాధ్యక్షులు వనం సత్యేంద్ర, అడ్వైజర్ GS శ్రీనివాస్, కమిటీ సభ్యులు, యశోదా ఆసుపత్రి డైరెక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.