Free Visit to Ram Mandir in Ayodhya: హైదరాబాద్: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టను దేశ వ్యాప్తంగా పండుగలా జరుపుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభిజీత్ లగ్నంలో అయోధ్య ఆలయం (Ayodhya Ram Mandir)లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వైభవంగా ఉంది. దీన్ని పురస్కరించుకుని దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోని రామ భక్తులు దీపాలు వెలిగించి దీపోత్సవంలో పాలు పంచుకున్నారు. అయోధ్యలో కొలువుదీరిన రాముడ్ని దర్శించుకోవాలనుకున్న తెలుగు వారికి కృష్ణ ధర్మ పరిషత్ (Krishna Dharma Parishad) గుడ్ న్యూస్ చెప్పింది.


5 లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం 
ఏపీ, తెలంగాణ నుంచి అయిదు లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం కల్పించాలని కృష్ణ ధర్మ పరిషత్ నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రామ మందిరం వేడుకలను పురస్కరించుకుని కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం  హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అయోధ్య రాముడి ఉచిత దర్శనం కల్పిస్తామని కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకుడు అభిషేక్ గౌడ్ ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు krishnadharma.in వెబ్ సైట్ లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. హైదరాబాద్ లో అయోధ్య రామ మందిరం విజయ్ దివస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 
ఈ సందర్భంగా కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకుడు అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిరం (Ram Mandir in Ayodhya) కల సాకారం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. రామయ్య భక్తుల 5 శతాబ్దాల కల నెరవేరిందన్నారు. రామ మందిర వేడకను కాంగ్రెస్ పార్టీ (Congress Party) బహిష్కరించడాన్ని తప్పుపట్టారు. ప్రజల ఆకాంక్షతో సాకారమైన రామయ్య ఆలయంపై రాజకీయాలు చేయడం తగదని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తమ ఓటుతో తీర్పు చెప్పాలని పిలుపునిచ్చారు. మత సామరస్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరూ చేసినా సహించకూడదన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో  తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచిందని, ఈసారి 12 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. బీజేపీ కోసం పనిచేస్తున్న రామ్ యాదవ్ కు మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని పార్టీ ఎంపీ లక్ష్మణ్‌ను అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అభిషేక్ గౌడ్ పేర్కొన్నారు.


బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ (BJP MP Laxman) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయోధ్య రామాలయం విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించిన కృష్ణ ధర్మ పరిషత్ ను అభినందించారు. ధర్మ పరిరక్షణ కోసం సంస్థ చేస్తున్న సేవల్ని కొనియాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని పార్టీలు వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. రాముడిని తిరస్కరించిన వారు రాజకీయంగా ముందుకు వెళ్లలేరని, సర్వేజనా సుఖినోభవంతు అనేది సనాతన ధర్మం లక్ష్యమన్నారు.
Also Read: Dhruva Sarja: దైవభక్తిని చాటుకున్న హీరో - అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజే పిల్లలకు నామకరణం