ఇప్పటికీ 2023 టీ 20 జట్టును ప్రకటించిన ఐసీసీ(ICC)... తాజాగా 2023 వన్డే జట్టును కూడా ప్రకటించింది. ఐసీసీ వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ ( Odi Team Of The Year 2023) జట్టులో భారత స్టార్ ఆటగాళ్ల డామినేషన్ స్పష్టంగా కనిపించింది. గత ఏడాది వన్డే క్రికెట్‌లో భారత ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. అద్భుత ఇన్నింగ్స్‌లతో టీమిండియాకు మరపురాని విజయాలను అందించారు. ఒక్క ప్రపంచకప్‌ ఫైనల్‌ తప్ప అన్ని సిరీస్‌లో మెరుగ్గా రాణించారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ జట్టులో ఆరుగురు భార‌త క్రికెట‌ర్లు చోటు ద‌క్కించుకున్నారు. ఈ టీమ్‌కు రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా, శుభ్‌మ‌న్ గిల్ ఓపెన‌ర్‌గా ఎంపిక‌య్యారు. సెంచ‌రీల మోత మోగించిన‌ విరాట్ కోహ్లీ, బంతితో మాయ చేసిన‌ కుల్దీప్ యాద‌వ్, సిరాజ్, ష‌మీలు జట్టులో చోటు దక్కించుకున్నారు.

 

వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌: రోహిత్ శ‌ర్మ(కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్), మార్కో జాన్సన్, ఆడం జంపా, మ‌హ్మద్ సిరాజ్, కుల్దీప్ యాద‌వ్, మ‌హ్మద్ ష‌మీ

 

ఐసీసీ టీం కెప్టెన్‌గా సూర్య భాయ్‌

టీమిండియా టీ 20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు అరుదైన గౌరవం దక్కింది. టీ 20 క్రికెట్‌లో మెరుపులు మెరిపించే ఈ విధ్వంసకర ఆటగాడిని 2023 ఐసీసీ టీ 20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నియమించింది. ప్రతి ఏడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌.. క్రికెట్లోని ప్రతి ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో టీంలను ప్రకటిస్తుంది. 2023 సంవత్సరానికిగానూ అంతర్జాతీయ టీ20 జట్టుకు కెప్టెన్‌గా భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది.  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య భాయ్‌ నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ప్రకటించిన 2023 టీ20 జట్టులో టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ , స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ టీమ్‌లో ఉన్నారు. గత ఏడాది టీ 20ల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు ఈ జట్టులో చోటు దక్కలేదు. 

 

ఆసిస్‌ నుంచి ఒక్కరూ లేరు...

2023 ఐసీసీ టీ 20 జట్టులో ఒక్క ఆస్ట్రేలియా క్రికెటర్‌కు కూడా స్థానం దక్కకపోవడం క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రానిస్‌ హెడ్‌, వార్నర్‌, కమిన్స్‌ సహా చాలా మంది ఆటగాళ్లున్న వారెవరికీ స్థానం దక్కలేదు. సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్లకూ ఈ జట్టులో స్థానం దక్కలేదు.

 

టీ20 టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: యశస్వి జైస్వాల్‌, ఫిల్‌ సాల్ట్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), మార్క్‌ చాప్‌మన్‌, సికందర్‌ రజా, అల్పేష్‌ రంజానీ, మార్క్‌ అడైర్‌, రవి బిష్ణోయ్‌, రిచర్డ్‌ ఎంగర్వ, అర్ష్‌దీప్‌ సింగ్‌.