భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య అయిదు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్ధమవుతోంది. ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో గురువారం తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. భారత్‌లో మరోసారి సిరీస్‌ విజయంపై కన్నేసిన ఇంగ్లాండ్‌ తీవ్ర కసరత్తుల్లో మునిగిపోయింది. సొంతగడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌ ఓడి 11 ఏళ్లు గడిచిపోయాయి. కానీ చివరగా ఓడింది ఇంగ్లాండ్‌ చేతిలోనే.  2012లో సిరీస్‌ను త‌న్నుకుపోయిన ఇంగ్లండ్‌ను ఈసారి గ‌ట్టి దెబ్బ కొట్టాల‌ని టీమిండియా ప‌ట్టుద‌లతో ఉంది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌ ఆరంభం ముందు ఇరు జట్లు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) సిద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో అశ్విన్‌ను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి..

 

అశ్విన్‌ ముంగిట అరుదైన రికార్డు

అశ్విన్‌ 500 వికెట్ల మైలురాయికి పది వికెట్ల దూరంలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్ల క్ల‌బ్లో చేరేందుకు అత‌డికి మ‌రో 10 వికెట్లు అవ‌స‌రం. అశ్విన్ ఇప్పటి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున 95 టెస్టు మ్యాచులు ఆడి 490 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు ప్రద‌ర్శన 34 సార్లు న‌మోదు చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఇంకో 10 వికెట్లు సాధిస్తే ఐదువంద‌ల మైలురాయిని అందుకుంటాడు. ఈ సిరీస్‌లో గనక అశ్విన్‌.. ఏడు వికెట్లు తీస్తే భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇండియా నుంచి అగ్రస్థానంలో నిలుస్తాడు. అశ్విన్ ఇప్పటి వ‌ర‌కు ఇంగ్లాండ్ పై 88 వికెట్లు తీశాడు. మ‌రో 12 వికెట్లు గ‌నుక అత‌డు ఈ సిరీస్‌లో తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన మొద‌టి భార‌త బౌల‌ర్‌గా నిల‌వ‌నున్నాడు. అశ్విన్ ప్రస్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. పైగా సిరీస్ జ‌రిగేది స్వదేశంలో కాబ‌ట్టి ఈ రికార్డు అన్నింటిని అత‌డు ఉప్పల్‌లో జ‌రిగే మొద‌టి టెస్టు మ్యాచులోనే అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. భార‌త జ‌ట్టు త‌రుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు ప‌డ‌గొట్టి బౌల‌ర్‌గా అనిల్ కుంబ్లే ఉన్నాడు. అత‌డు 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. రెండో స్థానంలో అశ్విన్ ఉన్నాడు.

 

నాపై మీ వ్యూహం పనిచేయదన్న బుమ్రా

ఇంగ్లీష్ ఆట‌గాళ్లు బాజ్ బాల్ ఆట‌తో త‌న‌పై పైచేయి సాధించ‌లేర‌ని బుమ్రా(Bumrah) స్పష్టం చేశాడు. బాజ్ బాల్ ఆట‌తో చెల‌రేగుతున్న ఇంగ్లండ్‌కు అభినంద‌న‌లు తెలుపుతూనే ఆ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. తాను ఒక బౌల‌ర్‌గా ఎప్పుడూ పై చేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తానని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడి తనను అల‌స‌ట‌కు గురి చేయ‌లేరని అన్నాడు. బ్రిటీష్‌ జట్టు వికెట్లు వికెట్లు ప‌డ‌గొట్టి తాను బ‌దులిస్తానని హెచ్చరించాడు. మైదానంలో ప‌రిస్థితుల‌ను తనకు అనుకూలంగా ఎలా మ‌ల‌చుకోవాలో తెలుసని బుమ్రా అన్నాడు. 

 

ప్రాక్టీస్‌ షూరూ..

ఇప్పటికే ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేశారు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సిరాజ్‌, బుమ్రా, శ్రేయస్‌, శుభ్‌మన్‌ ఆటగాళ్లు సాధనలో పాల్గొన్నారు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్‌లో మునిగిపోయారు . తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25 నుంచి 29 వరకు రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం స్టేడియంలో అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, రాచకొండ పోలీసులు సమన్వయంతో భద్రత, పార్కింగ్‌, మిగతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు