భారత్‌-ఇంగ్లాండు(India vs England)తో తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం(Uppal Rajiv Gandhi International Stadium)లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25 నుంచి 29 వరకు రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(Hyderabad Cricket Association) స్టేడియంలో అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, రాచకొండ పోలీసులు సమన్వయంతో భద్రత, పార్కింగ్‌, మిగతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేశారు.


టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma), సిరాజ్‌(Siraj), బుమ్రా(Bumrah), శ్రేయస్‌(Sreyas iyer), శుభ్‌మన్‌(Shubman gill) ఆటగాళ్లు సాధనలో పాల్గొన్నారు. ఇంగ్లాండ్‌ (England) ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి . టికెట్‌ ధరలు రూ.200 నుంచి రూ.4వేల వరకు ఉన్నాయి. వీటిలో కూడా 5 రోజులకు ప్యాకేజీ రూపంలో తక్కువ ధరకే ఇస్తున్నారు. రూ.200 టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.600లకే లభిస్తున్నాయి. రూ.1000 టికెట్‌ రూ.3వేలకు, రూ.1250 టికెట్‌ రూ.3750లకు, రూ.3వేల టికెట్‌ రూ.12వేలకు, రూ.4వేల టికెట్‌ రూ.16వేల చొప్పున విక్రయిస్తున్నారు. టికెట్లను జింఖానా మైదానంతో పాటు ఇన్‌సైడర్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లోనూ, పేటీఎం, పేటీఎంఇన్‌సైడర్‌ మొబైల్‌ యాప్‌లో టికెట్లను విక్రయిస్తున్నారు.


స్కూల్‌ స్టూడెంట్స్‌కు స్టేడియంలో ఉచిత ప్రవేశం
టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ ఐదు రోజుల పాటు 25 వేల మంది స్కూల్‌ స్టూడెంట్స్‌కు స్టేడియంలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామ‌ని, అలానే తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కుటుంబాల‌కు రిప‌బ్లిక్ డే రోజున ఉచితంగా అనుమ‌తిస్తున్నామ‌ని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని, అయితే, క‌చ్చితంగా స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి వ‌చ్చిన లెట‌ర్ ఆధారంగా పాస్‌లు కేటాయిస్తాం కానీ, వ్యక్తిగ‌తంగా ఇచ్చేది లేద‌ని స్పష్టం చేశారు. స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజనం, తాగునీరు ఉచితంగా అందిసున్నామ‌ని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది వారి విభాగ‌దిప‌తి నుంచి లెట‌ర్ తీసుకుని హెచ్‌సీఏ సీఈఓకి ఈమెయిల్ చేయాల‌ని సూచించారు.



అబుదాబి నుంచి నేరుగా...
భారత్‌, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుండగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లోని ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అబుదాబి(Abu Dhabi) లో దాదాపు నెల రోజుల క్యాంపు అనంతరం ఇంగ్లండ్ జట్టు భారత్‌కు వచ్చింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా టెస్ట్ సిరీస్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించిన రోహిత్ సేన పట్టుదలగా ఉంది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లను చూడడానికి అభిమానులు ఎగబడగా ఆ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (England Cricket board)ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. హలో హైదరాబాద్.. ఇది ముత్యాల నగరం అంటూ పోస్ట్‌కు కామెంట్‌ పెట్టింది.