ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనదారులు మాత్రం నిబంధనలను బేఖాతరు చేస్తుంటారు. ట్రాఫిక్ సజావుగా ముందుకు సాగకపోవడానికి కొంత మంది తమ వాహనాలను రోడ్ల పక్కన పార్క్ చేయడం ఓ కారణం. దాని కారణంగా రోడ్డు సగం వరకూ ఆక్రమణకు గురైనట్లుగా అయి, వాహనాలు మెల్లగా కదులుతుంటాయి. ఈ సమస్య కేబుల్ బ్రిడ్జిపై మరీ ఎక్కువగా ఉంటుంది. 


కాలినడకన వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఫుట్ పాత్ నిర్మించినప్పటికీ, బ్రిడ్జిపై నుంచి వెళ్లే వాహనదారులు తమ కార్లను లేదా బైక్ లను రోడ్డు పక్కన నిలిపి ఫోటోలు దిగుతుంటారు. ఇలా చాలా మంది చేయడం వల్ల రాకపోకలు సాగించేవారికి ఇబ్బంది కలుగుతుంటుంది. గతంలో ఈ విషయంపై పోలీసులు ఎన్నో సార్లు హెచ్చరించారు. బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన కొత్తలో సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ వాహనాలు ఎవరైనా బ్రిడ్జిపై ఆపితే సైరన్లు కూడా మోగించేవారు. ఎంతో మందికి ఫైన్లు కూడా వేశారు. అయినా జనం కార్లను, బైక్ లను రోడ్డుపై నిలుపుతూనే ఉన్నారు.


ఫిర్యాదుల కోసం ప్రత్యేక నెంబరు


ఈ సమస్యపై తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను నిలిపితే జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఎవరైనా కేబుల్‌ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్‌ చేస్తే 9490617346 అనే నెంబ‌ర్‌కు నగరవాసులు వాట్సాప్ చేయాలని సూచించారు. 


దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా, ప్రమాదాల‌ు జరగకుండా నివారించేందుకు సైబ‌రాబాద్ పోలీసులు క‌ఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహ‌నాల‌ను పార్కింగ్ చేయ‌రాద‌ని పోలీసులు హెచ్చరించారు. పార్కింగ్ చేసిన వాహ‌నాల‌కు భారీ జ‌రిమానా విధిస్తామ‌ని తేల్చిచెప్పారు. క్యారేజ్‌వే వ‌ద్ద వాహ‌నాల‌ను పార్క్ చేయ‌డం వ‌ల్ల ఇత‌ర వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతుంద‌ని అన్నారు. పార్కింగ్ చేస్తే భారీ జ‌రిమానా విధిస్తామ‌ని సైబ‌రాబాద్ పోలీసులు ట్వీ్ట్ ద్వారా హెచ్చరించారు.


కేబుల్ బ్రిడ్జిపై వాహ‌నాల‌ను పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బందులకు గురయ్యే పౌరులు ఆ విషయాన్ని తమ దృష్టికి తేవాలని కోరారు. ఫిర్యాదు చేయడం వల్ల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 9490617346 అనే నెంబ‌ర్‌కు వాట్సాప్ చేయడం ద్వారా తాము స్పందిస్తామని చెప్పారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేసిన వారి వివ‌రాల‌ను గోప్యంగా ఉంచుతామ‌ని పోలీసులు వెల్లడించారు.