ఎక్క‌డైనా చోరీ జ‌రిగిందంటే చాలు.. మీ సొమ్ము ఇక తిరిగి మీకు దొరుకుతుందా లేదా అనే అనుమానం ఉంటుంది. చుట్టుప‌క్క‌ల వాళ్లు సైతం మీ డ‌బ్బు లేదా విలువైన వ‌స్తువులు మీరు తిరిగి పొంద‌లేర‌ని చెబుతుంటారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఊహించ‌ని దాని కంటే భిన్నమైన ప‌రిస్థితి త‌లెత్తుతుంది. పోయిన మీ సొమ్ముకు మేం భ‌రోసా అంటున్నారు  పోలీసులు. 


సాధారణంగా ఇళ్లు, షాపులు, కార్యాల‌యాలలో అధికంగా చోరీలు జ‌రుగుతుంటాయి. అయితే దొంగ‌త‌నం జ‌రిగిన విష‌యాన్ని చాలా మంది దాచిపెడుతుంటారు. కొంద‌రు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు, మ‌రికొంద‌రు ఫిర్యాదు చేస్తే లాభం ఏముంటుంది, మ‌న డ‌బ్బు తిరిగిరాద‌ని భావిస్తారు. నేటితో ప్ర‌జ‌ల‌లో ఆ అపోహ‌ తొలగిపోయిందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ అన్నారు. చోరీ కేసుల సొత్తుపై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.


 సైబరాబాద్‌ కమిషనరేట్ ప‌రిధిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చోరీ జ‌రిగిన త‌రువాత బాధితులు పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి ఫిర్యాదు చేయ‌డం ఒక ఎత్తు అయితే, వాటిని తాము దొంగ‌ల నుంచి రిక‌వ‌రీ చేసుకోవ‌డం ఇంకో ఎత్తు అని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ అన్నారు. పోగొట్టుకున్న సొత్తును బాధితులకు కోటిన్న‌ర రూపాయ‌ల‌కు పైగా అంద‌జేసిన‌ట్లు తెలిపారు. మొత్తం 176 కేసుల్లో కోటిన్న‌ర‌కు పైగా సొత్తును త‌మ పోలీసులు రిక‌వ‌రీ చేశార‌ని పేర్కొన్నారు. 


చోరీ కేసుల‌ను ఛేదించ‌డం సైతం కొంత క‌ష్ట‌త‌ర‌మేన‌ని, అయినా త‌మ పోలీసులు ముఖ్యంగా కానిస్టేబుళ్లు శ్రమించి దొంగ‌ల‌ను ప‌ట్టుకున్నార‌ని ప్ర‌శంసించారు. చోరీ అయిన సొమ్మును బాధితుల‌కు సాధ్య‌మైనంత వ‌ర‌కు యథాత‌థంగా అప్ప‌గించ‌డంలో కానిస్టేబుళ్లు కీల‌క‌పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు. పోగొట్టుకున్న సొత్తును బాధితుల‌కు ఇప్పించాలని చాలా రోజులుగా అనుకుంటున్నామ‌ని, ఎట్ట‌కేల‌కు ఈరోజు ఆ ప‌ని సాధ్యమైందన్నారు. చోరీ అయిన సొమ్ము త‌మ‌కు తిరిగి ద‌క్క‌ద‌నే భావ‌న స‌రికాదన్నారు. ప్ర‌జ‌లు అలా భావించి ఫిర్యాదులు చేయ‌డం మానివేస్తే ప్ర‌తి ప్రాంతంలోనూ చోరీల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.


చోరీ జ‌రిగిన త‌రువాత సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బాధితులు ఫిర్యాదు చేస్తే నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌న్నారు. కోటిన్న‌ర సొత్తును బాధితుల‌కు అందించ‌డం చాలా సంతృప్తికరమైన రోజు అని చెప్పారు. సైబ‌రాబాద్ ప‌రిధిలో రిక‌వ‌రీ చేసిన సొమ్మును ఇక‌నుంచి త‌ర‌చుగా బాధితుల‌కు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఇత‌ర నేరాల‌తో పాటు చోరీ కేసుల‌పై సైతం ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తామ‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. ప్ర‌జ‌లు సైతం అనుమానితుల వివ‌రాలు తెలుపుతూ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు.