Cyberabad Police Key Announcement On Diwali Celebrations: దీపావళి సందర్భంగా నగరవాసులకు బిగ్ అలర్ట్. పండుగ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) గురువారం కీలక ప్రకటన చేశారు. బాణాసంచా కాల్చడానికి టైం లిమిట్ విధించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే టపాసులు కాల్చాలని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2వ తేదీ వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో.. పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని చెప్పారు. నగరవాసులు సహకరించాలని.. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కీలక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించిన విషయాన్ని నోటీసుల్లో ఆయన ప్రస్తావించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు.






'ఆ టపాసులు కాల్చొద్దు'


అటు, బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టపాసులపై లక్ష్మీదేవి బొమ్మ ఉంటే వాటిని కొనొద్దని ప్రజలకు సూచించారు. టపాసులపై హిందూ దేవతల బొమ్మలు ఉంచడం పెద్ద కుట్ర అని.. అలాంటి వాటిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. 'హిందూ దేవతల బొమ్మలుంటే టపాసులు కాల్చొద్దు. లక్ష్మీదేవి బొమ్మ ఉంటే అస్సలు కొనొద్దు. ఇది హిందువుల దేవుళ్లను హిందువులతో కాల్చేసే కుట్ర. ఈ దీపావళి నుంచి ప్రజలు ఓ సంకల్పం తీసుకోవాలి. మన దేవుడి బొమ్మలున్న పటాకులు మనం కాల్చకుండా ఉంటే వచ్చే ఏడాది అలాంటి టపాసులు ఎవరూ అమ్మకుండా ఉంటారు. దయచేసి ఇది అందరూ పాటించాలి. పండుగను అంతా ఆనందంగా జరుపుకోవాలి. పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి టపాసులు కాల్పించాలి. బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.' అని సూచించారు.


Also Read: Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?