Tirumala News: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలని అభిప్రాయపడ్డారు. టీటీడీకి కొత్త ఛైర్మన్‌గా ఎంపికైన బీఆర్‌నాయుడు. దీనిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా ఎంపికైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుకు, ఎన్డీఏ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. 


గత ఐదేళ్లపాటు ప్రభుత్వం చేసే అక్రమాలు అరాచకాలు చూడలేకే తిరుమల దర్శనానికి వెళ్లలేదని అన్నారు బీఆర్‌నాయుడు. చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన తాను ఏడాదికి ఐదారుసార్లు కొండకు వెళ్లే వాళ్లమని గుర్తు చేశారు. అలాంటి తనకు టీటీడీ ఛైర్మన్ పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన జీవితంలో మలుపుగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు సేవ చేస్తాను అన్నారు. 


గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కారణంగా చాలా సమస్యలు పేరుకుపోయాయని తెలిపారు బీఆర్‌నాయుడు. వాటిపై ఇప్పటికే చంద్రబాబుతో చర్చించానని పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 


సొంత డబ్బుతో తిరుమలకు సేవ చేయాలనే ఆలోచన ఉందని.. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా పని చేస్తామన్నారు. అక్కడ పని చేసే వారంతా హిందువులై ఉండాలని తన ప్రయత్నమని అన్నారు. టీటీడీ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని... స్వామీజీలతో కూడా పరిచాయలు ఉన్నాయన్నారు. ఓ ఆధ్యాత్మిక ఛానల్ కూడా రన్ చేస్తున్నట్టు వెల్లడించారు. జీవితంలో తిరుమల తప్ప వేరే దేవాలయానికి వెళ్లలేదని పేర్కొన్నారు. తనపై విమర్శలకు ఎలా సమాధానాలు చెప్పాలో తనకు బాగా తెలుసు అన్నారు నాయుడు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని వాటిపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం కచ్చితంగా కోర్టుకు వెళ్తామన్నారు. 


భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పం ఉందన్నారు బీఆర్‌ నాయుడు. తిరుమలేశుడి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరగా అంటే గంట లోపు దర్శనం అయ్యేలా వసతులు కల్పిస్తామన్నారు. టీటీడీ లాంటి ట్రస్టు ఉండగా... శ్రీ వాణి ట్రస్టుతో ఏం పని అన్నారు. దాన్ని రద్దు చేయాలనేది తన ఆలోచనగా వెల్లడించారు. దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమలకు వచ్చే వస్తువులు, ఆలయ భూములపై కమిటీ వేస్తామన్నారు. గాజు సీసాల్లో ఇస్తున్న నీరు ఖరీదు భక్తులకు చాలా భారంగా మారుతోందన్నారు నాయుడు. అందుకే వాటి స్థానంలో పేపర్ గ్లాస్‌లు తీసుకొస్తామని తెలిపారు. ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చి భక్తులు చిరునవ్వుతో దర్శించుకొని ఇంటికి వెళ్లేలా చేస్తామని చెప్పుకొచ్చారు. 


 టీటీడీ బోర్డు సభ్యులు వీళ్లే..



  • వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)

  • జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)

  • పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)

  • ఎం ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)

  • సాంబశివరావు (జాస్తి శివ)

  • నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)

  • కృష్ణమూర్తి

  • సదాశివరావు నన్నపనేని

  • కోటేశ్వరరావు

  • మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌

  • జంగా కృష్ణమూర్తి

  • దర్శన్‌ ఆర్‌.ఎన్‌

  • శాంతారామ్‌

  •  పి రామ్మూర్తి

  • జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌

  • జానకీదేవి తమ్మిశెట్టి

  • అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)

  • బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ)

  • సుచిత్ర ఎల్లా (తెలంగాణ)

  • బురగపు ఆనందసాయి (తెలంగాణ)

  • నరేశ్‌ కుమార్‌

  • డాక్టర్ అదిత్‌ దేశాయ్‌

  • సౌరబ్‌ హెచ్‌ బోరా