Diwali Celebrations In The Cemetry In Karimnagar: దీపావళి అంటేనే దివ్వెల పండుగ. చిన్న పెద్దా అనే తేడా లేకుండా కుటుంబమంతా కలిసి సంతోషంగా బాణాసంచా కాలుస్తూ వేడుకలు చేసుకుంటారు. ఇళ్లల్లో, దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. వ్యాపారులు లక్ష్మీపూజ చేస్తారు. అయితే, అక్కడ మాత్రం శ్మశానంలో దీపావళి వేడుకలు జరుపుకొంటారు. తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఏళ్లుగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వింత వేడుకలు కరీంనగర్ జిల్లాలో జరుపుతారు. దీపావళి రోజును శ్మశానంలో సమాధుల ముందు దీపాలు వెలిగిస్తారు. టపాసులు కాల్చి వేడుకలు చేసుకుంటారు. ఈ ఆచారాన్ని 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌లోని (Karimnagar) కార్ఖానాగడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో దాదాపు 60 ఏళ్లుగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. ఓ సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు శ్మశానంలో తమ కుటుంబీకుల సమాధుల వద్దనే వేడుకలు చేసుకుంటూ వస్తున్నారు. దీపావళికి వారం రోజుల ముందు నుంచే పెద్దల సమాధులు శుభ్రం చేసి రంగులు వేస్తారు. పువ్వులతో సుందరంగా అలంకరిస్తారు. పండుగ రోజు సాయంత్రం సమాధుల వద్దకు వచ్చే వేడుకలు నిర్వహిస్తారు. చుట్టూ దీపాలు వెలిగించి తమ వారిని గుర్తు చేసుకుంటారు. తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు వండి అక్కడ నైవేద్యం పెడతారు. అనంతరం సమాధుల వద్ద పూజలు చేస్తారు. ఆ తర్వాత టపాసులు కాల్చి వేడుకలు చేసుకుంటారు. 


ఇదే కారణం..


కాగా, తమ పూర్వీకులు లేనిదే తాము లేమని.. అందుకే పూర్వీకులను స్మరించుకోవడమే నిజమైన దీపావళి అని వీరు చెబుతున్నారు. గత 60 ఏళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. పండుగ రోజు వారిని స్మరించుకుంటూ శ్మశానంలో దీపావళి పండుగను జరుపుకొంటామని పేర్కొంటున్నారు. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా దీపావళికి ఇక్కడకు వచ్చి వేడుకలు చేసుకుంటారు. స్థానిక ప్రజలు సైతం వీరి విశ్వాసాన్ని గౌరవిస్తారు.


Also Read: Revanth Chit Chat Politics : చిట్‌చాట్‌లతో బీఆర్ఎస్ నేతల్ని రెచ్చగొడుతన్న రేవంత్ రెడ్డి - ట్రాప్‌లోకి లాగుతున్నారా ?