CWC Meeting in Hyderabad ends:


హైదరాబాద్ :  తెలంగాణలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు (CWC Meeting) ముగిశాయి. హైదరాబాద్ వేదికగా తాజ్ కృష్ణా హోటల్ లో రెండో రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎం, మాజీ సీఎంలు, మాజీ కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నతేలు సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొన్నారు.


త్వరలో ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సీడబ్ల్యూసీ మీటింగ్ లో కీలకంగా చర్చ జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. మరికాసేపట్లో తుక్కుగూడలో ప్రారంభం కానున్న విజయభేరి సభకు CWC నేతలు హాజరు కానున్నారు.


తెలంగాణ ప్రజలకు సీడబ్ల్యూసీ వినతి..
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక వినతి చేసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయాలని తెలంగాణ ప్రజలకు CWC విజ్ఞప్తి చేసింది. బంగారు తెలంగాణ కలను సాకారం చేసి, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును అందించాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్రను సీడబ్ల్యూసీ గుర్తుచేసుకుంది. ఆనాటి రాజకీయ పరిస్థితులను, ఎత్తుపల్లాలను పక్కన పెట్టి సైతం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర సాధనను సాధ్యం చేశారన్నారు. తొమ్మిదినరేళ్లు గడుస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను ఈ విషయంపై మోసం చేస్తూనే ఉన్నాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. 






రాష్ట్రం ఏర్పాటయ్యాక.. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు తెరలేపారని విమర్శించింది. ప్రజా సమస్యలు మర్చిపోయి కుటుంబానికి లబ్ది చేకూర్చడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కలను కాంగ్రెస్ సాకారం చేస్తే.. రాష్ట్రంలో మరోసారి నిజాం పాలన తీసుకొచ్చారని కేసీఆర్ పై సీడబ్ల్యూసీ మండిపడింది. తెలంగాణలో రాహుల్ గాంధీ 405 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రజలను, రైతులను కలుసుకుని వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. 


తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉందన్నారు. తుక్కుగూడలో జరగనున్న విజయభేరి సభలో కాంగ్రెస్ చేయనున్న 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లతో తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని సీడబ్ల్యూసీ నేతలు భావిస్తున్నారు. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.