Chandunayak's murder Case:హైదరాబాద్ మలక్‌పేట్‌లోని సిపిఐ రాష్ట్ర నాయకుడు చందునాయక్ ను ఈనెల 15వ తేదీన శాలివాహన పార్క్ వద్ద తుపాకీతో కాల్పిచంపారు దుండగులు. బహిరంగ ప్రదేశంలో గన్ ఫైరింగ్ ను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. చందునాయక్ హత్య కేసులో నిందితులను గాలించేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. చందునాయక్ హత్య వెనుక విహేతర సంబంధం ఉందని మొదట్లో అనుమానించారు, కానీ విహేతర సంబంధ కారణం కాదని తాజా విచారణతో క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
చందునాయక్ తో సన్నిహితంగా ఉండే మాజీ మావోయిస్టు రాజేష్ తో ఏర్పడ్డ విభేదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. కుంట్లూరు వద్ద ఉన్న భూమిలో పేదల గుడిసెలు ఏర్పాటు చేసేందుకు చందునాయక్ సహకరించాడు. అదే ప్రాంతంలో చందునాయక్ తోపాటు రాజేష్ సైతం గుడిసెలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు, పేదలను బెదిరించి చందాలు ఏర్పాటు చేస్తున్నాడని గుర్తించిన చందునాయక్ ఇదే విషయాన్ని పార్టీ ముఖ్యనేతలకు పిర్యాదు చేశాడు. దీంతో రాజేష్ ను పార్టీ నేతలు మందలించినట్లుగా సమాచారం.
పార్టీ నేతలకు తనపై ఫిర్యాదు చేయడంతోపాటు మామూళ్ల వసూళ్లకు చందునాయక్ అడ్డుపడుతున్నాడని భావించిన రాజేష్ కక్ష పెంచుకున్నాడు. చందునాయక్ ను హత్య చేసేందుకు వారం రోజులపాటు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. రాజేష్ తోపాటు అదే ప్రాంతానికి చెందిన తన సన్నిహితులు సుధాకర్, బాషా, శివతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఈ హత్యకు సహకరించినట్లుగా తెలుస్తోంది. హత్యలో కీలకంగా వ్యవహరించిన మరో నిందితుడు ఏడుకొండలు కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హత్య జరిగిన నాటి నుంచి యాదిరెడ్డి, రవిచంద్రాచారి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
కంట్లూరు గుడిసెల వివాదంలో రాజేష్ అండ్ గ్యాంగ్ తో విభేదాలు తారాస్దాయికి చేరడంతో అంతా ఏకమై చందునాయక్ ను హతమార్చేందుకు కుట్రపన్నినట్లుగా తెలుస్తోంది. హత్యకు ముందురోజు రాత్రి నిందితుల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయడంతోపాటు హత్యకు ప్లాన్ చేసిన రోజున , ముందుగా ఇంటివద్దే చందునాయక్ ను కాల్చి చంపేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. వీరిలో ప్రధాన నిందితుడైన మాజీ మావోయిస్టు రాజేష్ ను గమనించిన చందునాయక్ భార్య , ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. ఇంటి వద్ద రాజేష్ తిరుగుతున్నాడని, అయితే తనను పబ్లిక్ ప్లేస్ లో ఎవరేమీ చేయలేరని చెప్పిన చందునాయక్ లైట్ తీసుకున్నాడు. అయితే ఇంటి వద్ద హత్య చేసేందుకు అవకాశంలేకపోవడంతో వెనుక కారులో ఫాలో అయ్యారు. శాలివాహన పార్క్ వద్దకు చేరుకోగానే తుపాకీతో కాల్చి చంపి పారారయ్యారు.
హత్యలో నలుగురు నిందితులు ప్రత్యక్షంగా పాల్గొంటే, మరో ఐదుగురు హత్యకు స్కెచ్ వేయడంతోపాటు ఎప్పటికప్పుడు చందునాయక్ కదలికలపై సమాచారం అందించేవారు. చందునాయక్ ను పార్క్ వద్ద తుపాకీతో కాల్చిన వెంటనే చనిపోయాడని నిర్దారించుకుని అక్కడి నుంచి ఓక్యాబ్ లో ఉప్పల్ వరకూ వెళ్లిన నిందితులు, ఉప్పల్ నుంచి బస్సులో చౌటుప్పల్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుల కాల్ డేటా, సెల్ టైవర్ లొకేషన్, తప్పించుకున్న మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 4గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఐదుగురు నిందితుల ఆచూకీ గుర్తించినట్లుగా సమాచారం.